Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారిపై చర్యలు తీసుకోవాలి
- ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి :ఆవాజ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఖదీర్‌ఖాన్ చావుకు పోలీసులే కారణమనీ, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్ పోలీసులు ఖాదిర్ ఖాన్‌పై చైన్ స్నాచింగ్ కేసు బనాయించి చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు.
దీంతో అతను చనిపోయారని తెలిపారు. దొంగతనంతో సంబంధం లేని వ్యక్తిని అరెస్టు చేసి హింసించడం అత్యంత దుర్మార్గమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఖదీర్ ఖాన్ కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చైన్ స్నాచింగ్ కేసులో అనుమానితుడిగా అతన్ని అరెస్టు చేశారనీ, నేరం ఒప్పించడం కోసం పోలీసులు తీవ్రంగా కొట్టడంతో చనిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారని తెలిపారు. వీపుమీద కమిలిన దెబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు. నేరంతో ఖదీర్ ఖాన్ కు సంబంధం లేదని నిర్ధారణ అయ్యాక గుట్టుచప్పుడు కాకుండా వదిలేశారని తెలిపారు. కిడ్నీ ప్రాంతంలో తగిలిన దెబ్బల కారణంగా జనవరి ఐదున ఆస్పత్రిలో చేరారనీ, చికిత్స పొందుతూ ఖాదిర్‌ఖాన్ మృతి చెందాడని తెలిపారు. అతని మరణంతో భార్య ముగ్గురు పిల్లలు అనాధలయ్యారని పేర్కొన్నారు.
పోలీసులను కఠినంగా శిక్షించాలి : ఏఐవైఎఫ్
ఖాదీర్‌ఖాన్ చావుకు కారణమైన పోలీసులను కఠినంగా శిక్షించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లిఉల్లాఖాద్రీ, కె.ధర్మేంద్ర డిమాండ్ చేశారు. ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మెదక్ పోలీసులు ఖాదీర్ ఖాన్ పై చైన్ స్నాచింగ్ కేసు బనాయించి చిత్రహింసలకు గురిచేసి ఆయన చావుకు కారణమయ్యారని విమర్శించారు. ఈ ఘటనలో పోలీసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఖదీర్ ఖాన్ కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.
ఖదీర్‌ఖాన్ మృతి కేసులో
సీఐ సహా నలుగురు పోలీసుల సస్పెన్షన్
సంచలనంగా మారిన ఖదీర్‌ఖాన్(37) మృతి కేసులో మెదక్ పట్టణ సీఐ మధు, ఎస్సై రాజశేఖర్, కానిస్టేబుళ్లు పవన్ కుమార్, ప్రశాంత్‌ను సస్పెండ్ చేస్తూ ఐటీ చంద్రశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.