Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహుళ అంతస్థుల భవనాలు, పరిశ్రమలలో ప్రమాదాలపై చైతన్య కార్యక్రమాలు
- అగ్నిమాపక శాఖాధికారుల కార్యాచరణ
నవతెలంగాణ - ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలలో అవగాహన పెంచడానికి అగ్నిమాపక శాఖ ప్రత్యేక కార్యాచరణను చేపడుతున్నది. ముఖ్యంగా, హైదరాబాద్‌తో పాటు రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లు, ఇతర పట్టణాల్లో బహుళ అంతస్థుల భవనాలు, పరిశ్రమలలో అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇటీవలన సికింద్రాబాద్, పురాణాపూల్, మలక్‌పేట్, కూకట్‌పల్లిలలో భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం, వాటిని ఆర్పడానికి పదికి పైగా అగ్నిమాపక శకటాలు నిర్విరామంగా పని చేసి మంటలను ఆర్పేందుకు కృషి చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటికీ అగ్ని ప్రమాదాల పరంగా ఆయా సంస్థలు తగిన నివారణా చర్యలు చేపట్టకపోవడం, ముందు జాగ్రత్త చర్యగా అగ్నిమాపక పరికరాలను నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసుకోకపోవడమేనని అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో అగ్ని మాపకాలకు ఆస్కారమున్న పరిశ్రమలు, బహుళ అంతస్థుల భవనాలు, ఆస్పత్రులలో అవగాహనా కార్యక్రమాలను అగ్నిమాపక శాఖ అధికారులు చేపడుతున్నారు. ముఖ్యంగా, అగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారం ఆయా బహుళ అంతస్థుల భవనాలు, ఆస్పత్రులలోని వాటర్ సంపులలో నీటి నిల్వలు ఉంచుతున్నారా? లేదా మొదలుకొని ప్రతి అంతస్థులో అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేస్తున్నారా? లేదా ? అనే నిబంధనల పైన అగ్నిమాపక శాఖాధికారులు దృష్టిని కేంద్రీకరిస్తున్నట్టు తెలిసింది. అలాగే, బహుళ అంతస్థుల భవనాలలో ప్రమాదాలు జరిగితే అందులో ఉన్నవారు సురక్షితంగా వెలుపలికి వచ్చే విధంగా అవుటర్ స్టేర్ కేస్‌లను నిర్మించారా? లేదా అన్నది కూడా అధికారులు పరిశీలించబోతున్నట్టు తెలిసింది. వీటితో పాటు మరికొన్ని కీలకమైన నిబంధనలు కూడా బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తున్న బిల్డర్లు పాటిస్తున్నారా? లేదా ? అన్నది పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ వై. నాగిరెడ్డి అధికారులతో సమావేశమై చర్చించినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన కార్యాచరణను కొన్ని ప్రాంతాల్లో ఫైర్ సర్వీసు అధికారులు ప్రారంభించారు.