Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాంతో ఇతర మందులూ పని చేయని వైనం
- ఇష్టానుసారంగా వాడిన ఫలితం
- భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు : నిపుణుల హెచ్చరికలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా మహమ్మారి మానవాళి పట్ల చూపించిన దయనీయ పరిస్థితులు అందరికి అనుభవంలోకి వచ్చినవే. అయితే సమీప భవిష్యత్తులో కంటికి కనిపించని మరో మహమ్మారి పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రజల అవగాహనాలేమి పెరిగి కోరి విపత్తుకు స్వాగతం పలుకుతున్నారని హెచ్చరిస్తున్నారు. ఈ మారు వచ్చే మహమ్మారి కారణంగా మందులే పని చేయని దారుణ పరిస్థితులు ఏర్పడబోతున్నాయని విశ్లేషిస్తున్నారు. వైద్యసేవల ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ పుణ్యమానీ, ఖరీదైన మందుల వాడకం పేరుతో ప్రజలు అవసరానికి మించి యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, నియంత్రణ లేకపోవడం కూడా ఈ పరిస్థితికి మరో బలమైన కారణంగా చెబుతున్నారు. ఇప్పటికే వారంలో ఒక్కో విభాగంలో వారంలో మూడు నుంచి నాలుగు కేసుల్లో రాసిన మందులు పని చేయనివి ఉంటున్నాయని పలువురు డాక్టర్లు తమ అనుభవాలను చెబుతున్నారు. ఆధునిక వైద్య చికిత్సలో రోగం రావడానికి కారకాన్ని మొదట గుర్తించాలి. ఆ తర్వాత చికిత్సలో భాగంగా సంబంధిత డాక్టర్లు సిఫారసు చేసిన మందులను, సూచించిన మోతాదులో మాత్రమే (రాసిన దాని కన్నా ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా ) వాడాలి. సాధారణంగా వ్యాధులు ఫంగస్, వైరస్, పరాన్న జీవులు (పారాసైట్స్), హానికారక బాక్టీరియాల కారణంగా వస్తుంటాయి. వీటిని రోగ నిర్ధారణ పరీక్షల ద్వారా గుర్తించి, అందుకు తగిన చికిత్సను అందిస్తారు. అయితే చాలావరకు డాక్టర్ల వద్దకు వెళ్లకుండా రోగకారకాన్ని కూడా గుర్తించకుండా అన్ని రోగాలకు ఒకే మందు అన్నట్టు ... మెడికల్ షాపుల నుంచి యాంటీబయాటిక్స్‌ను తీసుకుని వాడటం కూడా ఇబ్బందికరంగా మారుతున్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా యాంటీబయాటిక్స్ వాడకంతో అవి పని చేసే శక్తిని కోల్పోతున్నట్టు గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 2015లోనే వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆయా దేశాలను హెచ్చరించింది. ఆ సభ్య దేశాల్లో వాటి నియంత్రణకు మార్గదర్శకాలను జారీ చేసింది. దీన్ని కార్యరూపంలో ఉంచాల్సిన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు, ఫార్మకో విజిలెన్స్ ప్రోగ్రాం ఆఫ్ ఇండియా ఔషధ వ్యవస్థను నియంత్రిస్తూ క్రమపద్ధతిలో కొనసాగించాల్సి ఉన్నది. దీనికి తోడు రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ అథారిటీ పని చేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర పరిధిలో పలు వ్యవస్థలను ఏర్పాటు చేసినప్పటికీ యాంటీబయాటిక్స్ ఇష్టానుసారంగా వాడే దానిపై పూర్తి స్థాయిలో నియంత్రణ సాధించకపోవడం గమనార్హం. క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ప్రకారం...ప్రతి ఆస్పత్రిలో ఫార్మసీ అండ్ థెరపటిక్ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి ఫార్మసిస్ట్ కన్వీనర్‌గా, ఆస్పత్రి సూపరింటెండెంట్ లేదా డైరెక్టర్ అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. అన్ని క్లినికల్ విభాగాలకు చెందిన డాక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఒక మైక్రో బయాలజిస్ట్ కు ఇన్ఫెక్షన్ డిసీజెస్ నియంత్రించే హౌదా కల్పించి యాంటీబయాటిక్స్ పాలసీని అమలు చేయాల్సి ఉంటుంది. అయితే చాలా వరకు కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రులు ఈ పాలసిని అమలు చేయకపోవడం లేదా మొక్కుబడిగా అయిందనిపించినట్టు వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం వీటన్నింటిని నియంత్రించాల్సిన నిపుణులు సూచిస్తున్నారు.
2050 నాటికి 10 మిలియన్ల మరణాలు :డాక్టర్ బుర్రి రంగారెడ్డి
వైద్య పరిభాషలో యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్)గా వ్యవహరించే యాంటీ బయాటిక్స్ పని చేయని పరిస్థితిని ఆపకపోతే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ల మరణాలు సంభవించే ప్రమాదముందని ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ బుర్రి రంగారెడ్డి హెచ్చరించారు. 2019 నాటికే 4.95 మిలియన్ల మంది బాక్టీరియల్ డ్రగ్ రెసిస్టెన్స్‌తో చనిపోయిన విషయాన్ని లాన్సెట్ రిపోర్ట్ చేసిందని గుర్తు చేశారు. పశువులకు సైతం అనవసర ంగా వాడే మందులతో మనుషుల్లోకి ఆహారం రూపంలో ఈ ప్రమాదం వస్తున్నదని తెలిపారు. ఉదాహరణకు ఇ.కొలి అనే యాంటీబయాటిక్ ఔషధం ముగ్గురిలో ఒకరికి మాత్రమే, క్లెబ్సియెల్లా న్యూమోనియా ఇద్దరు రోగుల్లో ఒకరికి మాత్రమే, కార్బపెనెమ్స్ అసినెటొబాక్టర్ బ్యూమన్ని పది మందిలో ఒకరికి మాత్రమే పని చేస్తుండడం పొంచి ఉన్న ప్రమాదాన్ని సూచిస్తున్నాయని తెలిపారు. ఈ సమస్యతో ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 28 మిలియన్ల మంది పేదరికంలోకి నెట్టబడతారనీ, ఇండియాలో దీనికి సంబంధించి నిర్దిష్టమైన గణాంకాలు లేకపోయినప్పటికీ వైద్య ఖర్చులతో పేదరికంలోకి నెట్టబడుతున్న అంశాల్లో ఇది కూడా చేరబోతున్నదని తెలిపారు.