Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం రూ.26 వేలు చేయాలి
- మార్చి 6న ఛలో లేబర్ కమిషనరేట్ : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-పటాన్చెరు
కార్మికులకు వారానికి ఐదు రోజుల పని దినాలు చేయడంతో పాటు, రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు పట్టణంలో గల శ్రామిక భవన్లో ఆదివారం జరిగిన కిర్బీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాలపరిమితి ముగిసిన జీవోలన్నింటిని వెంటనే సవరించాలని కోరారు. మోడీ ప్రభుత్వం కనీస వేతనం రూ.7వేలుగా ప్రతిపాదించడం అత్యంత దుర్మార్గమన్నారు. ప్రయివేటీకరణను వేగవంతం చేయడం దేశానికి ద్రోహం తప్ప వేరేది కాదన్నారు. బడ్జెట్లో కేటాయింపులను చూస్తే.. బీజేపీకి కార్పొరేట్ల మేలు తప్ప వేరే ప్రజల బాగోగులు అవసరం లేదని రుజువైందని చెప్పారు. బడ్జెట్లో కనీస వేతనాల ఊసే లేకపోవడంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్, బీమా లాంటి వాటిమీద స్పష్టత ఏమాత్రం రాలేదని విమర్శించారు. స్కీమ్‌లకు బడ్జెట్ పెంపుదల లేదని, రవాణా చట్టం, విద్యుత్ చట్టం లాంటివి ఉపసంహరించుకుంటుందేమోనని ఎదురుచూసిన కార్మికులకు నిరాశే మిగిలిందన్నారు. రవాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు గురించి ఊసేలేదని తెలిపారు. కార్మిక, ప్రజా వ్యతిరేక బడ్జెట్ పై ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్మిక వర్గ సమస్యలు, కనీస వేతనాలకై మార్చి 6న నిర్వహించ తలపెట్టిన ఛలో లేబర్ కమిషన్ కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లిఖార్జున్, రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య, యూనియన్ జనరల్ సెక్రెటర్ వి ఎస్ రాజు, నాయకులూ శ్రీనివాస్, మల్లేశు, సుధాకర్, లకాన్, ఏడుకొండలు, ప్రభు, మహేశ్వర్ రెడ్డి, శంకర్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.