Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షుగర్ లెవల్స్ పడిపోవడంతో ఆస్పత్రికి తరలింపు
- కార్డియాక్ అరెస్ట్‌తో మృతి
- ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
- సందర్శించిన సీఎం, మంత్రులు
నవతెలంగాణ-కంటోన్మెంట్/అడిక్‌మెట్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే జి. సాయన్న కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఆదివారం ఉదయం ఆకస్మికంగా షుగర్ లెవెల్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కార్డియాక్ అరెస్ట్ రావడంతో మృతి చెందారు. ఆయన మృతి చెందిన విషయం తెలుసుకుని నియోజకవర్గంలో అభిమానులు, కార్యకర్తలు శోక సంద్రంలో మునిగిపోయారు. కాగా, ఎమ్మెల్యే సాయన్న పార్థివదేహాన్ని కవాడిగూడ అశోక్‌నగర్‌లోని ఆయన నివాసానికి తీసుకురాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించి నివాళ్లర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. నివాళ్లర్పించిన వారిలో మంత్రులు హరీశ్‌రావు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, కాలేరు వెంకటేష్ మాగంటి గోపీనాథ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ రావు ఉన్నారు. ఎమ్మెల్యే సాయన్నకు భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. సోమవారం కార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం బన్సిలాల్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు వెల్లడించారు.
ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపు
సాయన్న 1951 మార్చి 5న సాయన్న - భూదేవి దంపతులకు హైదరాబాద్‌లో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆయన బ్యాంకులో పని చేశారు. కాలేజీ దశ నుంచి సాయన్నకు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. దాంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలక పదవిలో పనిచేశారు. ఈ క్రమంలో అశోక్‌నగర్ నుంచి కార్పొరేటర్‌గా ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు, ఆ తర్వాత వరుసగా 1994, 1999, 2004 ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2009లో కాంగ్రెస్ అభ్యర్థి పి శంకర్రావు చేతిలో ఓటమి చెందారు. అనంతరం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా ఆయన టీడీపీ నుంచి బరిలోకి దిగి మరోసారి గెలుపొందారు. 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరి 2019లో ఆ పార్టీ తరపున పోటీ చేసి ఐదో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తుండగా ఆయన కాలికి గాయాలు కావడంతో అప్పుడు షుగర్ లెవెల్ పెరగడంతో డాక్టర్లు ఓ కాలును తొలగించారు. అయినప్పటికీ సాయన్న అంగవైకల్యాలు మర్చిపోయి నియోజకవర్గ అభివృద్ధి కోసమే పాటుపడుతూ వచ్చారు. అలాగే సాయన్న హుడా డైరెక్టర్‌గా 6 సార్లు పనిచేశారు. కాగా ఆయన చిన్న కుమార్తె కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో కంటోన్మెంట్ టికెట్‌ను తన రెండో కుమార్తె నివేదికకు ఇవ్వాలని ఆయన సీఎం కేసీఆర్‌ను ఇటీవలే కలిసి కోరినట్టు తెలిసింది. అందుకు కేసిఆర్ నిరాకరించటంతో ఆయన తీవ్ర మనస్థాపానికి బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.