Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు సాగుదారులందరికీ హక్కులు కల్పించాలి
- కేంద్ర సర్కార్ ఆరాటం కార్పొరేట్ల కోసమే..
- హక్కుల్ని హరిస్తే ఉద్యమం తప్పదు : మహాధర్నాలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు సాగుదారులంతా తమ భూమిని ఆకలి తీర్చుకోవటం కోసమే ఉపయోగించుకుంటున్నారనీ, రియల్ఎస్టేట్ వ్యాపారం కోసం అటవీ భూములను ఆక్రమించుకోవటం లేదని నేతలంతా ప్రభుత్వాలకు గుర్తుచేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఆదివాసీ, అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు, పలు ప్రజాసంఘాల నాయకులు ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. పోడు సాగుదారులందరికీ ఎటువంటి ఆంక్షలు లేకుండా హక్కు పత్రాలివ్వాలని డిమాండ్ చేశారు. టైగర్ జోన్ పేరిట అడవి నుంచి ఆదివాసీలను వెళ్ళగొట్టే చర్యలను మానుకోవాలని హితవు పలికారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన అటవీ హక్కుల నియమాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమన్వయ కమిటీ కన్వీనర్లు వేములపల్లి వెంకట్రామయ్య, అంజయ్యనాయక్, శ్రీరాంనాయక్, కెచ్చెల రంగయ్య, అధ్యక్షతన జరిగిన మహాధర్నాలో ముఖ్యవక్తగా హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలివ్వాలంటూ సుదీర్ఘకాలంగా ఆదివాసీలు ఉద్యమించాల్సి రావటం బాధాకరమన్నారు. ఆదివాసీలకు పోరాటాలు కొత్తకావని చెప్పారు. ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తొలిసారి పోరాడింది ఆదివాసీలు, దళితులేనని వారు తెలిపారు. పోడు భూముల పోరాటంలో న్యాయముందని చెప్పారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఉప ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్టు ఎలాంటి ఆంక్షలు లేకుండా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోరాటం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కార మార్గమని చెప్పారు. పట్టాలు సాధించేంతవరకు పోరాటం చేయాలని గుర్తుచేశారు.
తెలంగాణ వస్తే పోడు సమస్యకు పరిష్కారం దొరుకుతుందనుకున్నాం : కోదండరాం
టీజేఎస్ అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ వస్తే పోడు సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించామని అన్నారు. అటవీ హక్కుల చట్టం పరిధిలో ఈ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతులను బలవంతంగా భూముల్లోంచి ఖాళీ చేయించడమేంటని ప్రశ్నించారు. అటవీ హక్కుల చట్టం ఇతర భూపంపిణీ చట్టాల లాంటిది కాదని చెప్పారు. 14రకాల సాక్ష్యాల్లో ఏ రెండు సాక్ష్యాలున్నా వారికి పట్టా ఇవ్వాల్సిందేనని చెప్పారు. అందుకోసం శాటీలైట్ విధానం తగదన్నారు. ఎమ్మెల్యేలు భూములు కబ్జాచేసి వ్యాపారం చేస్తున్నట్టుగా..గిరిజనులు పోడు భూములతో వ్యాపారం చేయబోరని గుర్తుచేశారు. వారు బువ్వకోసమే పోడు వ్యవసాయం చేస్తున్నారని గుర్తుచేశారు. ఆహారభధ్రతను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందనీ, ఈ నేపథ్యంలోనే వారికి హక్కు పత్రాలిచ్చి ఆకలి సమస్యను పరిష్కరించాలని సూచించారు.
శాటిలైట్ల ద్వారా తీసే చిత్రాలతో సమస్యకు పరిష్కారమా..! పశ్యపద్మ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ మాట్లాడుతూ ఉపగ్రహ ఛాయా చిత్రాల సమస్యను ఎందుకు ముందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. న్యాయబద్దంగా వారికి పట్టాలు ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాలన్నారు. కొద్దిమందికి మాత్రమే పట్టాలిస్తామని చెప్పడం సరికాదన్నారు.
పోడు పోరులో కలిసి వస్తాం..మల్లు రవి
కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి మాట్లాడుతూ పోడు భూములకోసం జరిగే పోరాటం లో తమ పార్టీ కలిసొస్తుందని చెప్పారు. పోడు సాగు దారులను ప్రభుత్వం ఇబ్బందులు పెట్టటం మాను కోవాలని హితవు పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను పక్కనపెట్టి తమ ఇష్టమొచ్చినట్టు పాలన సాగిస్తున్నాయని విమర్శించారు.
పోడు రైతులందరికీ పట్టాలివ్వాలి..గుమ్మడి నర్సయ్య
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ పోడు రైతులందరికీ పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. పట్టాలిస్తామంటూనే ఆంక్షలెందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ ఎనిమిదేండ్ల కాలంలో ఒక్క ఎకరానికి కూడా పట్టా ఇవ్వలేదని చెప్పారు. న్యూడెమోక్రసీ నాయకులు ఎస్ వెంకటేశ్వరరావు, మధు, ఎంఎల్ నాయకులు మల్లేశ్, ఎంసీపీఐ(యు) నాయకులు ఉపేందర్‌రెడ్డి, ప్రజాపంథా నాయకులు ప్రభాకర్, రైతు కూలీ సంఘం నాయకులు కోటేశ్వరరావు, గౌని ఐలయ్య, ప్రసాదన్న మాట్లాడుతూ పోడు దారులకు హక్కుపత్రాలు ఇవ్వకపోతే భవిష్యత్‌లో ఉద్యమాలను తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో ఆదివాసీ అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ నాయకులు మండల వెంకన్న, జక్కుల వెంకటయ్య, మామిడాల బిక్షపతి, రామకృష్ణ, తదితరులు కూడా మాట్లాడారు.
పోడు రైతులకు న్యాయం చేయాలి : జూలకంటి
పోడు రైతులకు న్యాయం చేయాలని సీపీఐ(ఎం) నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నాయన్నాయని విమర్శించారు. అటవీ హక్కుల చట్టాన్ని అనేక పోరాటాల ద్వారా, యూపీఏ-1 ప్రభుత్వంలో వామపక్షాల ఒత్తిడితో సాధించుకున్నామని గుర్తుచేశారు. ఈ చట్టాన్ని బలహీనపర్చేందుకు మోడీ సర్కార్ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం తాపత్రయపడుతున్నదని చెప్పారు. అటవీహక్కుల చట్టం ప్రకారం సాగులో ఉన్న పోడు రైతులందరికీ హక్కు పత్రాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పాలకులు ఈ పనిచేసుంటే..ప్రభుత్వ పరంగా రావాల్సిన సౌకర్యాలు, రాయితీలు రైతులు పొందేవారని చెప్పారు. మోడీ సర్కారు ఉన్న చట్టాలకు తూట్లుపొడిచి కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని వివరించారు. మరో పక్క సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో గిరిజనులకు ఒక్క హక్కుపత్రం కూడా ఇవ్వలేదని అన్నారు. విద్యా, వైద్యం లేకపోయినా పోడు భూమితో బతుకుతుంటే..దాంట్లోకి కూడా పోవద్దంటే ఎలా? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా వారికి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నది గిరిజనులు కాదని తెలిపారు. శాసన సభలో సీఎం చెప్పిన విధంగా అందరికీ హక్కుపత్రాలివ్వాలని కోరారు.