Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నామినేషన్ కార్యక్రమంలో పలువురు నేతలు
- మాణిక్‌రెడ్డికి ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల విస్తృత మద్దతు
- ఇందిరాపార్క్ నుంచి లిబర్టీ చౌరస్తా వరకు భారీ ప్రదర్శన
- జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఎస్‌యూటీఎఫ్ సీనియర్ నాయకులు, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఉమ్మడి, స్వతంత్ర అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డి గెలుపు చారిత్రక అవసరమని పలువురు నేతలు ఉద్ఘాటించారు. అప్పుడే విద్యారంగం, ఉపాధ్యాయుల సంక్షేమం, సమాజానికి ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. మాణిక్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బహిరంగ సభను నిర్వహించారు. అనంతరం ఇందిరాపార్క్ నుంచి లిబర్టీ చౌరస్తా వరకు భారీ ప్రదర్శనను చేపట్టారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలాకు నామినేషన్ పత్రాలను అందజేశారు. మాణిక్‌రెడ్డికి ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు విస్తృతంగా మద్దతు ప్రకటించాయి. అంతకుముందు బహిరంగ సభనుద్దేశించి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ మండలిలో తన ఒంటరితనానికి బ్రేక్ పడే అవకాశం తొందర్లోనే ఉందంటూ ఆకాంక్షిం చారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం తాము పాటుపడతామని చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లు ఓటర్లుగా నమోదయ్యారని అన్నారు. వారి కోసం యజమాను లు మాట్లాడబోరనీ, తామే ప్రభుత్వాల దృష్టికి సమస్యలను తీసుకెళ్తామనీ వివరించారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం విద్యా, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని విమర్శించారు. ఎన్ఈపీ, సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. మండలిలో ప్రజల వాణిని బలంగా వినిపించాలంటే మాణిక్‌రెడ్డిని గెలిపించు కోవాలని చెప్పారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ మాట్లాడుతూ మండలిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ముగ్గురున్నా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నర్సిరెడ్డి ఉన్నారని అన్నారు. మాణిక్‌రెడ్డి గెలిస్తే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వస్తుందన్నారు. అభ్యర్థుల పనితీరు, నిజాయితీ, నిబద్ధతను చూసి ఓటెయ్యాలని కోరారు. స్వార్థానికి ఓటేస్తారా? నిస్వార్థంగా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పోరాడే మాణిక్‌రెడ్డికి ఓటేస్తారా?అన్నది ఉపాధ్యాయులు తేల్చుకోవాలని చెప్పారు. సమస్యలపై లోతైన అవగాహన ఉన్న వారే ప్రభుత్వాలను ప్రశ్నిస్తారని అన్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ జోక్యం లేదనీ, ఉపాధ్యాయులు స్వేచ్ఛగా ఓట్లేస్తారని చెప్పారు. మాణిక్‌రెడ్డి గెలిచేందుకు అన్ని రకాలుగా అవకాశాలున్నాయన్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ మాట్లాడుతూ పోటీ చేసే అభ్యర్థుల్లో ఉత్తమమైన వ్యక్తి మాణిక్‌రెడ్డి అని అన్నారు. తెలంగాణ కోసం, ప్రజా ఉద్యమాల కోసం ఆయన గెలవాలని ఆకాంక్షించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలనూ అమ్ముతున్నదని చెప్పారు. అదానీ సంపద కొల్లగొడుతున్నారంటూ ప్రచారం చేసే ధైర్యం ఎవరికైనా ఉందా?అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ పేరును నిలబెట్టాలనీ, కొత్త సచివాలయంలోకి మాణిక్రెడ్డిలాంటి నిజాయితీ ఉన్న వ్యక్తి అడుగుపెట్టాలని అన్నారు.
మాణిక్‌రెడ్డికి ఇతర వ్యాపారాల్లేవ్
ఉన్నత విద్యా పరిరక్షణ కమిటీ చైర్మెన్ అందెసత్యం, టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి, ఉపాధ్యక్షులు దుర్గాభవాని, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, పాలిటెక్నిక్ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఉదరుభాస్కర్, వృత్తి విద్యా ఉపాధ్యాయుల సంఘం ఉపేందర్, టీఎస్ ఎంఎస్టీఎఫ్ అధ్యక్షులు బి కొండయ్య, తెలంగాణ ఆల్ గురుకుల ఉపాధ్యాయుల సంఘం చైర్మెన్ మామిడి నారాయణ, సెక్రెటరీ జనరల్ డాక్టర్ ఎ మధుసూదన్ తదితరులు మాట్లాడుతూ నర్సిరెడ్డికి తోడుగా మరో గొంతును మండలికి పంపేందుకే మాణిక్‌రెడ్డికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. కొత్త గురుకులాలు అద్దె భవనాల్లో ఉండడం వల్ల వాటి యజమానులకే ప్రయోజనం కలుగుతున్నదని విమర్శించారు. అన్ని గురుకులాలనూ ఒకే డైరెక్టరేట్ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. మాణిక్‌రెడ్డికి ఉపాధ్యాయులకు సేవ చేయడం తప్ప వేరే వ్యాపారాల్లేవనీ, సమస్యలపై పాలకులను ప్రశ్నిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ కోశాధికారి టి లక్ష్మారెడ్డి, కార్యదర్శులు ఎ వెంకట్, ఎం రాజశేఖర్‌రెడ్డి, రవిప్రసాద్‌గౌడ్, కె రవికుమార్, జి నాగమణి, ఈ గాలయ్య, బి రాజు, వై జ్ఞానమంజరి, ఎ సింహాచలం, ఎస్‌వై కొండల్రావు, టీఎస్ఎంఎఎస్టీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.