Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దండుపాళ్యం బ్యాచ్... రోజులు లెక్కపెట్టుకోవాలే
- కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వమే : రేవంత్ రెడ్డి
నవతెలంగాణ - కాజీపేట/వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మతసామరస్యానికి ప్రతీకగా ఉన్న కాజీపేట దర్గా సాక్షిగా దేశాన్ని విభజించాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. టీపీసీసీ అధ్యక్షులు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేపట్టిన 'హాత్ సే హాత్' జూడో యాత్ర వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో సోమవారం అట్టహాసంగా కొనసాగింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం కాజీపేటలోని హజ్రత్ సయ్యద్ షా బియాబానీ దర్గాను ఆయన సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం సుబేదారి ఆర్ట్స్ కళాశాల (లా కాలేజ్) నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి అమరవీరుల స్థూపం (అదాలత్ జంక్షన్) మీదుగా కాళోజీ విగ్రహం, ఏకశిలా పార్క్, ప్రెస్‌క్లబ్, హన్మకొండ కొత్త బస్టాండ్, శ్రీదేవి మాల్, అంబేద్కర్ సర్కిల్, పోలిస్ హెడ్ క్వార్టర్స్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, హన్మకొండ చౌరస్తా మీదుగా ఏనుగుల గడ్డ వరకు పాదయాత్ర సాగింది. ఏనుగులగడ్డ సెంటర్లో సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కుల మతాల మధ్య చిచ్చులు రాజేస్తూ పాలన సాగిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని, దండుపాళెం బ్యాచ్ రోజులు లెక్కపెట్టుకోవాలని బీఆర్ఎస్ను ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలని, సమస్యలు పరిష్కారం కావాలని రాష్ట్రాన్ని ఇచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని విమర్శించారు. మన సమస్యలను ఎప్పటికప్పుడు రాసే జర్నలిస్టులు వాళ్ల సమస్యలు చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో కవులు, కళాకారులు, మేధావులు, విద్యావంతులు అందరూ ఆలోచించాలని కోరారు. సునీల్ నాయక్ పీజీ చదివిన సునీల్ నాయక్ అనే నిరుద్యోగి ఉద్యోగాల నోటిఫికేషన్లు లేక ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోలేదన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని 3000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. 2018-22 వరకు 10 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతుబీమా లెక్కల ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 80 వేల మంది చనిపోయారని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని తెలిపారు. బీఆర్ఎస్ నేతలతో పాటు బీజేపీ నేతలూ భూ కబ్జాలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు. ఏకశిలా పార్క్‌కు జయశంకర్ సార్ పేరు పెట్టారని, ఆ పార్క్‌లో బీరు సీసాలు పడి పొర్లుతున్నా యన్నారు. కాళోజీ కళాక్షేత్రం మొండిగోడలు దర్శనమిచ్చా యని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించినా నేటికీ పేదలకు పంచకుండా కనిపించా యన్నారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని, లేదంటే నేనే పెడతానని మా హన్మన్న డిమాండ్ చేస్తే ఈరోజు వరకు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిఖం భూములు, చెరువులు కబ్జా కావడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారణం కాదా అని ప్రశ్నించారు. పార్టీ కోసం కష్టపడ్డ నేతలను, కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని స్పష్టంచేశారు.
కాగా, పాదయాత్ర అంతా వినతులు, సమస్యలు వినడంపై రేవంత్‌రెడ్డి ఎక్కువ శ్రద్ధ పెట్టారు. దర్గాను సందర్శించిన రేవంత్ వారితో మైనార్టీల సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. కేయూ విద్యార్థులు వారి సమస్యలు వివరించారని, అడ్వకేట్లు, మహిళలు వారి బాధలు తెలిపారు. ఎనుమాముల మార్కెట్లో దోపిడిపై రైతులు కలిసి వారి సమస్యలు చెప్పారు. సమావేశానికి హన్మకొండ డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్, మహ్మద్ షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ ఛీఫ్ వి. హన్మంతరావు, మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్, అస్మదుల్లా హుస్సేన్, వేం నరేందర్‌రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కూచన రవళి తదితరులు పాల్గొన్నారు.