Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.6,757 కోట్లను చెల్లించాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని తెలంగాణ సర్కార్... హైకోర్టును కోరింది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను చట్ట ప్రకారం పరిష్కరించుకునేందుకు మార్గాలున్నాయని గుర్తు చేసింది. అయి నా కేంద్రం తమ వాదనను వినకుండా ఏకపక్షంగా, తెలంగాణపై కక్షతో ఆదేశాలిచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆలస్యపు చెల్లింపు, సర్ ఛార్జీల కింద మొత్తం రూ.6,757 కోట్లను ఏపీకి చెల్లించాలనే ఆదేశాలను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. కేంద్ర ఆదేశాల అమలును నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరోసారి డివిజన్ బెంచ్ పొడిగించింది. తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదించారు. విచారణను కోర్టు మార్చి 14కు వాయిదా వేసింది.
లాకప్‌డెత్‌పై నేడు విచారణ
మెదక్ పోలీస్ స్టేషన్లో ఖాదిర్‌ఖాన్ లాకప్ డెత్ ఘటనను హైకోర్టు సుమటో పిటిషన్‌గా పరిగణించి మంగళవారం విచారించనుంది. లాకప్ లో ఉండగా పోలీసులు కొట్టడం వల్ల గాయపడిన ఖాన్ ఈనెల 16న రాత్రి గాంధీ ఆస్పత్రిలో చనిపోయాడు. దొంగతనం కేసులో అతడిని పోలీసులు వేధించారనే ఆరోపణలొచ్చాయి. ఈ ఘటనపై పత్రికల్లో వచ్చిన వార్తలు, కథనాల నేపథ్యంలో హైకోర్టు కేసును విచారించాలని నిర్ణయించింది.