Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎల్ఏ మల్లు భట్టి విక్రమార్కకు రైతుల మొర
నవతెలంగాణ - బోనకల్
ఆళ్ళపాడు మేజర్ కింద ఎండిపోతున్న మొక్కజొన్న పంటకు పూర్తి స్థాయిలో సాగర్ నీటిని అందించి పంటలను కాపాడాలని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా బోనకల్ బ్రాంచ్ కెనాల్ పరిధిలోని ఆళ్ళపాడు మేజర్‌ను సోమవారం సుమారు 200 మంది రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడే నీటిపారుదల శాఖ ఈఈ రామకృష్ణ, బోనకల్ డీఈ పబ్బతి శ్రీనివాస్‌తో సాగర్ నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ళపాడు మేజర్ కింద సాగు చేసిన మొక్కజొన్న పంట అన్నదాతలు తమ సమస్యను మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదలశాఖ అధికారులకు వివరించారు. ఆళ్లపాడు మేజర్ కింద ఆళ్లపాడు, గోవిందాపురం ఏ, బోనకల్ తదితర గ్రామాల కింద 3,600 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేసినట్టు రైతులు తెలిపారు. ఆళ్ళపాడు మేజర్‌కు సాగర్ నీరు సక్రమంగా విడుదల చేయకపోవడం వల్ల మొక్కజొన్న పంట దాదాపు ఎండిపోవటానికి వచ్చిందన్నారు. ఒక్కొక్క ఎకరానికి సుమారు రూ.30 వేలు పెట్టుబడి పెట్టామని, కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఒక క్వింటా కూడా దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఈఈ రామకృష్ణ స్పందిస్తూ.. పంటలు తడిసే వరకు నీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, టీపీసీసీ సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి బంధం నాగేశ్వరరావు, జడ్పీటీసీ మోదుగు సుధీర్‌బాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాలి దుర్గారావు, కలకోట సొసైటీ అధ్యక్షులు కర్నాటి రామకోటేశ్వరరావు పాల్గొన్నారు.