Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జైల్లో పరిచయాలతో నోట్ల సరఫరా
- ఇద్దరు నిందితుల అరెస్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
యూట్యూబ్ చూసి నకిలీ నోట్లను తయారుచేస్తున్న ఇద్దరిని హైదరాబాద్ టాస్క్ఫోర్సు, చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.27లక్షల విలువగల నకిలీ నోట్లు, ల్యాప్‌టాప్, ప్రింటర్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని పాత పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్సు సీఐ ఎస్.రాఘవేంద్ర, చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ కె.ఎన్.ప్రసాద్వర్మతో కలిసి డీసీపీ డాక్టర్ శబరీష్ వివరాలు వెల్లడించారు. నారాయణ్‌పేట్‌కు చెందిన పాత నేరస్థుడు కస్తూరి రమేష్‌బాబు కారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని యూట్యూబ్‌ను పరిశీలించాడు. అందులో నకిలీ నోట్లు ఎలా తయారు చేయాలో చూశాడు. ఆ తర్వాత నకీలీ నోట్లు తయారు చేయడం ప్రారంభించాడు. వాటిని కావాల్సిన వారికి, తెలిసిన వారికి సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలో పలుసార్లు జైలుకెళ్లొచ్చాడు. ఇదిలావుండగా ఓసారి జైల్లో ఫలక్‌నుమాకు చెందిన హసన్బిన్ హమూద్‌తో రమేష్‌కు పరిచయం ఏర్పడింది. హసన్‌కు పెద్దఎత్తున కస్టమర్లు ఉండటంతో కమీషన్ పద్ధ్దతిలో నకిలీ నోట్లను సరఫరా చేస్తానని రమేష్‌తో ఒప్పదం చేసుకున్నాడు. ఈ క్రమంలో హుస్సేన్, రామేశ్వరితో కలిసి నకిలీ నోట్లను చలామణి చేసేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు, చాంద్రాయణగుట్ట పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రమేష్‌బాబును గుజరాత్ పోలీసులు పట్టుకున్నారని డీసీపీ తెలిపారు. అతన్ని అరెస్టు చేసి విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగుచూస్తాయని తెలిపారు. నిందితులపై గుజరాత్, హైలదరాబాద్ తదితర పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైనట్టు తెలిపారు. చాకచక్యంగా కేసును ఛేదించినం దుకుగాను పోలీసులను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు.