Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా వ్యాప్తి కారణంగా ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు సగమే చెల్లించి ఆ మిగిలిన మొత్తాన్ని తర్వాత చెల్లించిన ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వారికి 50 శాతం తిరిగి ఇవ్వటంలో జరిగిన జాప్యానికి ఆరు శాతం వడ్డీ చెల్లించాలంటూ సూచించింది. జీతాలు, పెన్షన్లను 50 శాతానికి తగ్గిస్తూ 2020, మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 27ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ జీవోను సవాల్ చేస్తూ దాఖలు చేసిన రిట్ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఏపీ ప్రభుత్వం ఇదే తరహాలో తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేసిన కేసులో సుప్రీంకోర్టు ఆరు శాతం వడ్డీ చెల్లించాలంటూ ఆదేశించిందనీ, ఆ ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. సంబంధిత ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను ముగిస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.