Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న హార్ట్ అటాక్ కేసులు
- కోవిడ్ తర్వాత మరింత ప్రమాదకరంగా మారిన వైనం
- గతంతో పోలిస్తే 20 శాతానికి పైగా నమోదవుతున్న కేసులు
- చిన్న వయస్సు వారిని వదలని తీరు
- జాగ్రత్తలు తప్పవంటున్న వైద్యులు, నిపుణులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇటీవల సినీ నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుతో మరణించిన విషయం అందరిని కలచివేసింది. కేవలం 40 సంవత్సరాల వయస్సున్న ఆయనకు గుండె పోటు రావడమేంటని అటు అభిమానులు, ఇటు సాధారణ ప్రజలు ఆశ్చర్య పోయారు. కాని 40 ఏండ్లే కాదు... ఇప్పుడు 30 ఏండ్ల వారికి కూడా గుండె జబ్బులు వస్తున్నాయనీ, అప్రమత్తంగా లేకుంటే ప్రాణాలకు ముప్పు తప్పక పోవచ్చని వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ఈ సందర్భంగా వారు తారకరత్న మరణాన్ని ఉదహరిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో గుండె జబ్బులు పెరుగుతున్న తీరును పరిశీలిస్తే మరిన్ని విషయాలు అవగతమవు తున్నాయి.
హార్ట్ అటాక్ బారిన పడుతున్న వారి సంఖ్యతో పాటు సకాలంలో చికిత్స అందక మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఇటీవల బాగా పెరిగింది. గుండె పోటుతో మరణిస్తున్న వారిలో అత్యధికులు 30 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వయస్సు మధ్య వారుండటం గమనార్హం. ఇటీవల కాలంలో 30 నుంచి 40 ఏండ్ల వయస్సు వారు సైతం గుండె పోటుకు గురి కావడం ఆందోళనకరం. గతంలో హార్ట్ అటాక్‌కు గురైన వారిలో 70 శాతం మందికి పైగా 40 ఏండ్ల పైబడిన కేసులుండగా, ప్రస్తుతం ఆస్పత్రులకు వస్తున్న బాధితుల్లో 50 శాతం మంది 40 ఏండ్లలోపు వారే ఉంటున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి అనంతరం కాలం నుంచి ఈ పరిస్థితి పెరుగుతూ వస్తున్నది. గతంలో హార్ట్ అటాక్ రావడానికి కారణమయ్యే వాటికి తోడు కోవిడ్-19 ప్రభావం, దానితో మారిన జీవనశైలి కూడా గుండెపోటు వైపు నెడుతున్నాయి. దేశవ్యాప్తంగా 2012లో 18,522 మంది హార్ట్ అటాక్‌తో చనిపోగా, 2021 వచ్చే నాటికి ఇది ఏకంగా 28,449కి పెరిగినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వీరిలోనూ 19,744 మంది 30 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్సు వారే ఉండటం గమనార్హం.
శారీరక శ్రమలేకపోవడం, జంక్ ఫుడ్ తీసు కోవడం, వ్యాయామం చేయకపోవడం, ధూమ పానం, మద్యపానం, కుటుంబ చరిత్ర కలిగి ఉండటం, డయాబెటీస్, కొలెస్ట్రాల్ తదితరాలను హార్ట్ అటాక్ రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పు కునే వాళ్లం. ప్రస్తుతం వస్తున్న హార్ట్ అటాక్ కేసుల్లో వీటికి తోడు మరికొన్ని కారణాలు వైద్య నిపుణుల పరిశోధనలో వెల్లడైంది. కరోనా ప్రభావం పడిన వారిలో భౌతిక వయస్సు, జీవశాస్త్ర (బయలాజికల్ ఏజ్) మధ్య తేడా రావడం, కరోనా తర్వాత వర్క్ ఫ్రం హౌంతో దైనందిన జీవితంలో ఉన్నపళంగా వచ్చిన మార్పు, ఉద్యోగాలు, ఉపాధి కోల్పోవడంతో ఆ ఒత్తిడి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇందులో భౌతిక వయస్సు, బయాలజికల్ ఏజ్ మధ్య తేడా వచ్చిన వారు బయటికి చూసేందుకు బాగానే కనిపిస్తుంటారనీ, అయితే శరీరంలోని జీవ ప్రక్రియ పరంగా ఏజ్ బార్ అయిపోయి ఉంటారని డాక్టర్లు విశ్లేషిస్తున్నారు. ఇక సెలబ్రిటీల్లో హార్ట్ అటాక్‌లు ఎక్కువగా రావడానికి శక్తికి మించిన శ్రమ చేయడం, తగిన విశ్రాంతి తీసుకోకపోవడం, ఫలితంగా ఒత్తిడికి గురి కావటమే కారణమని డాక్టర్లు చెబుతున్నారు.
లక్షణాలను గుర్తించాలి
గుండెపోటు వచ్చే ప్రమాదమున్న లక్షణాల ను గుర్తిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని గచ్చిబౌలి ఒమెగా హాస్పిటల్ కన్సల్టెంట్ ఇంటర్వె న్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ అక్రమ్ అలీ సూచించారు. ప్రతి మనిషి దైనందిన జీవితంలో చేసే పనులు యధావిధిగా చేయలేకపోవడం గుండెలో వచ్చే మార్పులు కారణం కావచ్చని చెప్పారు. ఉదాహరణకు ప్రతి రోజు 2 కిలోమీటర్లు నడిచే వ్యక్తి అంతకన్నా ముందే అలసిపోతున్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తున్నా... డాక్టర్‌ను సంప్రదించడం, ఈసీజీ తీసుకుంటే భవిష్యత్తులో హార్ట్ అటాక్ బారిన పడకుండా కాపా డుకునే అవకాశముందని ఆయన సూచించారు.
- డాక్టర్ సయ్యద్ అక్రమ్ అలీ
(హృద్రోగ నిపుణులు)