Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాదయాత్ర డిమాండ్లను నెరవేర్చాలి : సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని గ్రామ పంచాయితీల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయితీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి చేపట్టిన పాదయాత్ర డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు సోమవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో సుమారు 40 వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులు పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, నీటి సరఫరా, కారోబార్, బిల్ కలెక్టర్లు, ఆఫీస్ నిర్వహణ తదితర పనులను నిర్వహిస్తున్నారని తెలిపారు. వారిలో అత్యధికులు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు చెందిన పేదలేనని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వారు నిరాదరణకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్నారని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి వేతనాలను రూ.8500లకు పెంచినా, అది శాస్త్రీయ పద్ధతిలో లేదని పేర్కొన్నారు. ఈ ఏడాదిలోని జనాభా, పంచాయతీల విస్తరణకనుగుణంగా వారు సేవలందిస్తున్నారని వివరించారు. కానీ 2011 జనాభాను మాత్రమే లెక్కలోకి తీసుకుని 500 జనాభాకు ఒక కార్మికుడిగా పరిగణించారని తెలిపారు. క్షేత్రస్థాయిలో గ్రామ అవసరాల ప్రాతిపదికన పంచాయతీ పాలకవర్గం మరికొంత మంది కార్మికులను నియమించుకున్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ పెంచిన వేతనాలు ఇవ్వకపోవడంతో కొందరికి మాత్రమే వస్తున్న వేతనాలను అందరూ పంచుకుంటున్నారని తెలిపారు. దీంతో అత్యధిక మంది కార్మికులకు రూ.3,500ల నుంచి రూ.4,500ల వరకు మాత్రమే వస్తున్నాయని వివరించారు. వేతనాలు పెంచామనే సాకుతో వివిధ కేటగిరీలను రద్దు చేసి మల్టీపర్పస్ వర్కర్ విధానం తీసుకొస్తూ ప్రభుత్వం 51 జీవోను తెచ్చిందని గుర్తు చేశారు. దీంతో కార్మికులకు పని భారం పెరిగిందని పేర్కొన్నారు. కారోబార్‌తో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, ట్రాక్టర్ల డ్రైవర్, చివరికి ప్రజా ప్రతినిధుల ఇండ్లలో వ్యక్తిగత పనులను కూడా చేయించుకుంటున్నారని విమర్శించారు. వేతనాలు కూడా నాలుగు నుంచి ఏడు నెలల వరకు బకాయిలుగా ఉంటున్నాయని తెలిపారు. దీంతో కార్మికులు అప్పులపాలై ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
సిబ్బందిని పర్మినెంట్ చేయాలి
గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్ల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి పాదయాత్ర జరుగుతున్నదని తమ్మినేని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 60 జీవోను గ్రామపంచాయతీ కార్మికులకు కూడా వర్తింపజేస్తూ, పారిశుద్ధ్య కార్మికులకు రూ.15,600, కారోబార్, బిల్కలెక్టర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, వీధి దీపాల నిర్వహణ, నీటి సరఫరా కార్మికులకు రూ.19,500, కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ విభాగంలో పనిచేసే సిబ్బందికి రూ.22,750 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
యాక్ట్ 2/94ను రద్దు చేసి పంచాయతీ సిబ్బందినందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించి వారిని అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని సూచించారు. 51 జీవోను సవరించాలనీ, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు. పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం అమలు చేయాలని పేర్కొన్నారు.
పంచాయతీ కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5.50 లక్షలు ఆర్ధిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మల్టీపర్పస్ వర్కర్ విధి నిర్వహణలో ప్రమాదానికి గురై డ్యూటీ చేయలేని స్థితిలో ఉన్న వారు, మరణించిన వారి కుటుంబ సభ్యులకు పంచాయతీల్లో ఉద్యోగావకాశం కల్పించాలని తెలిపారు.
దళితబంధును ప్రాధాన్యతా క్రమంలో అమలు చేయాలంటూ పాదయాత్ర బృందం కోరుతున్నదని తమ్మినేని పేర్కొన్నారు. ఇవి గొంతెమ్మ కోర్కెలు కావనీ, వారి న్యాయమైన సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.