Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టెరిలైజేషన్‌లో అవకతవకలు
- 2021లో కుక్కల సంఖ్య 4,61,145
- 2023లో 7 లక్షలకుపైగా కుక్కలు
- కుక్కల నియంత్రణకు జీహెచ్ఎంసీ చర్యలు శూన్యం
- పెరుగుతున్న కుక్క కాట్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్‌లో కుక్కల బెడద పెరుగుతోంది. వీధి కుక్కలను నియంత్రించాల్సిన జీహెచ్ఎంసీ చోద్యం చూస్తోంది. అంబర్పేట్ లాంటి ఘటన జరిగినప్పుడే బల్దియా హడావుడి చేస్తోంది తప్ప సీరియస్‌గా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవని పలువురు ప్రజాసంఘాల నేతలు విమర్శిస్తున్నారు. కుక్కలను నియంత్రించడానికి స్టెరిలైజేషన్‌లో భారీగా అవకతకవలు జరిగాయనే విమర్శలూ లేకపోలేదు. అందుకు కుక్కల సంఖ్య పెరగడమే నిదర్శనం. జీహెచ్ఎంసీ పకడ్బందీగా ఆపరేషన్లు చేస్తే కుక్కల సంఖ్య తగ్గాలి తప్ప పెరుగుతోంది. 2021లో జీహెచ్ఎంసీ పరిధిలో 4,61,145, 2022లో 5 లక్షలు, ప్రస్తుతం 7లక్షలకుపైగా కుక్కలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కుక్క కాటు కేసులు సైతం వేలల్లో ఉంటున్నాయని వారే చెబుతున్నారు.
ఎన్జీఓలకు బాధ్యతలు
జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో బ్లూక్రాస్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. కుక్కలను నియంత్రించడంతోపాటు కుక్కకాటు కేసులను తగ్గించాలనే లక్ష్యంతో వీధి కుక్కల సర్వే చేపట్టారు. వీధి కుక్కల నియంత్రణలో భాగంగా రోజుకు 250 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఒక్కో ఎన్జీఓకు ఒక్కో జోన్ అప్పగించారు. ఎల్బీనగర్ జోన్‌ను పీపుల్ ఫర్ ఎనిమల్, శేరిలింగంపల్లి జోన్‌ను బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్, సికింద్రాబాద్, కూకట్పల్లి జోన్లను వెట్ సొసైటీ ఫర్ ఎనిమల్ వెల్పేర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఖైరతాబాద్ జోన్‌ను నవోదయ వెట్సొసైటీ, చార్మినార్ జోన్‌ను ఎనిమల్ వెల్ఫేర్ సొసైటీ సంస్థలకు అప్పగించారు.
తప్పుడు లెక్కలు
జీహెచ్ఎంసీలో పరిధిలో అధికారుల లెక్కల ప్రకారం 2021లో 4,61,145 కుక్కలు, 2022లో 5లక్షలు, 2023లో సుమారు 6 లక్షల కుక్కలు ఉన్నట్టు అంచనా. వీటిలో 75శాతం కుక్కలకు స్టెరిలైజేషన్ పూర్తయినట్టు మేయర్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఐదు యానిమల్ కేర్ సెంటర్ల ద్వారా స్టెరిలైజేషన్, యాంటీరేబిస్ వ్యాక్సినేషన్ చేస్తున్నామ న్నారు. జీహెచ్ఎంసీ ద్వారా 2020-21లో 50,091 వీధి కుక్కలకు, 2021-22లో 73,601, 2022-23లో 40,155 వీధి కుక్కలకు స్టెరిలైజ్ చేయబడిందని వెటర్నరీ అధికారులు వివరించారు. 2021లెక్కల ప్రకారం 4,61,145 కుక్కలు ఉన్నా యని, వాటిలో 1,99,182 కుక్కలకు ఆపరేషన్లు చేసినట్టు, మరో 2,61,963 కుక్కలకు ఆపరేషన్లు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. అంటే తప్పుడు లెక్కలతో బల్దియా కాలయాపన చేస్తోందని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
75శాతం స్టెరిలైజేషన్ : మేయర్
వీధి కుక్కల దాడిలో బాలుడి మృతిపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విచారం వ్యక్తం చేశారు. మంగళవారం అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అంబర్పేట్ ఘటనపై విచారణకు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా, జీహెచ్ఎంసీ తరఫున బాలుడి తల్లిదండ్రులకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యానిమల్ బర్త్ కంట్రోల్, యాంటీ రేబిస్ ఇంజక్షన్లను ప్రతి సర్కిల్కూ కేటాయించినట్టు మేయర్ తెలిపారు. వీధి కుక్కలపై వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడూ పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఇద్దరు అధికారులతోపాటు ప్రతి సర్కిల్‌కు ఒక వాహనాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. నగరవ్యాప్తంగా 5.75లక్షల కుక్కలున్నాయని, వీటిలో 75శాతం కుక్కలకు స్టెరిలైజేషన్ పూర్తిచేసినట్టు మేయర్ వివరించారు. సమావేశంలో చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వకీల్, సెంట్రల్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ చక్రపాణిరెడ్డి, సికింద్రాబాద్ జోన్ అసిస్టెంట్ డైరెక్టర్ సద్గుణ, వెటర్నరీ ఆఫీసర్ బిక్యా బాణావత్, అంబర్పేట్ డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
ఆప్ ధర్నా
అంబర్పేట్ ఘటనపై విచారణ జరిపించి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆప్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్ నాయకులు సుధాకర్ మాట్లాడుతూ.. కుక్కల నియంత్రణలో జీహెచ్ఎంసీ విఫలమైందన్నారు. స్టెరిలైజేషన్ కార్యక్రమంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని, చేయకుండానే చేసినట్టు నిధులు కాజేస్తున్నారని అన్నారు. బాలుని కుటుంబానికి రూ.2కోట్ల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వీధి కుక్కల నియంత్రణలో జీహెచ్ఎంసీ విఫలం
వీధి కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన ఘటన అత్యంత బాధాకరం. ఇలాంటి ఘటనలు ప్రతి ఏటా జరుగుతున్నాయి. వీధి కుక్కల దాడిలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో జనం గాయాలపాల వుతున్నారు. 75 శాతం వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేశామని నగర మేయర్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. ఇంత పెద్ద సంఖ్యలో స్టెరిలైజేషన్ చేస్తే వీధి కుక్కల సంఖ్య ఎందుకు పెరిగింది? 2021లో 4,60,000 ఉన్న వీధి కుక్కల సంఖ్య నేడు 5 లక్షల 75 వేలకు ఎలా పెరిగింది? వీధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టే బాధ్యతను జీహెచ్ఎంసీ వదిలేసి ప్రయివేటు స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పడం చాలా నష్టం. జీహెచ్ఎంసీ పూర్తిస్థాయి బాధ్యత వహించి తగిన సిబ్బందిని ఏర్పాటు చేసుకొని, వీధి కుక్కల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి. వీధి కుక్కలు అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
- ఎం శ్రీనివాస్
సీపీఐ(ఎం) నగర కార్యదర్శి,
గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ.