Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమోషన్ల సమస్యను పరిష్కరించాలి: సీఎం కేసీఆర్‌కు బండి లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భాషా పండితులను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దుచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భాషా పండితుల ప్రమోషన్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 8,500 మంది భాషా పండితులు 22 ఏండ్లుగా సర్వీసులో ఉన్నా ప్రమోషన్లు ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. వారంతా ఇంకా ఎస్జీటీలుగానే కొనసాగుతుండటం బాధాకరమని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ప్రాథమికోన్నత తరగతుల వరకే బోధించాల్సి ఉన్నప్పటికీ వారితో 9,10 తరగతులకు కూడా క్లాసులు చెప్పించడం అన్యాయమని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకుండా వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం అన్యాయమని తెలిపారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా భాషా పండితులకిచ్చే కానుక ఇదేనా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.