Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'అంబర్పేట ఘటన'పై మంత్రి కేటీఆర్
- పునరావృతం కాకుండా చూస్తామంటూ హామీ
నవతెలంగాణబ్యూరో - హైదరాబాద్
వీధి కుక్కల దాడిలో చిన్నారి మరణించటం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఘటన తనను ఎంతగానో కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. హైదరాబాద్ అంబర్పేటలో ఆదివారం ప్రదీప్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో ఆ పసివాడు మరణించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ...బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సాను భూతిని తెలిపారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటు న్నామనీ, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామంటూ హామీనిచ్చారు.
తక్షణమే చర్యలు తీసుకోవాలి : డీవైఎఫ్ఐ
హైదరాబాద్ మహానగరంలో వీధి కుక్కల దాడుల నుంచి ప్రజలు, చిన్నారులను కాపాడటంలో జీహెచ్ఎమ్సీ ఘోరంగా విఫలమైందని డీవైఎఫ్ఐ విమర్శించింది. వాటి నిర్మూలన కోసం వెంటనే తగు చర్యలు తీసు కోవాలని కోరింది. వీధి కుక్కలకు ఇంజక్షన్లు ఇచ్చి వదిలేయకుండా శాశ్వత నివారణా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి కుటుంబానికి తగిన విధంగా న్యాయం చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.