Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత మత్స్యకారులు, మత్స్యకార్మిక సమాఖ్య పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో మత్స్యకారులకు అతి తక్కువగా నిధులు కేటాయించటాన్ని నిరసిస్తూ.. ఏప్రిల్ మూడున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అఖిల భారత మత్స్యకారులు, మత్స్యకార్మిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి పులివిల్లై స్టాన్లీ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన తమ సమాఖ్య జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించామని ఆయన వెల్లడించారు. ఆ సమావేశాలు సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగాయి. ఆ సంఘం జాతీయ అధ్యక్షులు దేవి శశి బర్మన్ అధ్యక్షతన పలు తీర్మానాలను ఆమోదించారు. దేశవ్యాప్తంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఏప్రిల్ 3న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మత్స్యకారులతో భారీ ఎత్తున ధర్నా నిర్వహించేందుకు కార్యవర్గ సమావేశం పిలుపునిచ్చింది. సమావేశంలో అఖిల భారత మత్స్యకారులు, మత్స్యకార్మిక సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ కె. హేమలత, టి మనోహరన్, బషీర్ కుట్టాయి, ఉమా సర్కార్, జాతీయ కోశాధికారి జి మమత, జాతీయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ మెహఫసు రెహమాన్, జాతీయ కమిటీ సభ్యులు గోరింకల నర్సింహ, సిహెచ్ రమణి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు కొప్పు పద్మను సంఘం జాతీయ కమిటీ సభ్యురాలిగా ఎన్నుకున్నారు. ఆమె హైదరాబాద్ జిల్లా మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మెన్‌గా గతంలో పనిచేశారు.