Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రీ సైక్లింగ్‌తో ప్రభుత్వానికి ఆదాయం : ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
నవ తెలంగాణ-సిద్దిపేట
మనిషి ఆరోగ్యానికి భూమికి అవినాభావ సంబంధం ఉందని, భూమి బాగుంటే మనిషి బాగుంటాడని, రసాయనిక ఎరువులు వాడకం వల్ల క్యాన్సర్ వేగంగా విస్తరిస్తుందని, దాంతో ఆర్థికంగా, శారీరకంగా పూర్తిగా దెబ్బతింటోంది కాబట్టి భూమి సారాన్ని కాపాడుకుంటేనే ఆరోగ్యాన్ని కాపాడుకుందామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పత్తి మార్కెట్ ఆవరణలో 'భూమిత్ర-మన తడిచెత్త- మన సేంద్రియ ఎరువు- మన నేల' సిద్దిపేట బ్రాండ్‌తో జీవ సంపన్న సేంద్రియ ఎరువులను మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమిత్ర సిద్దిపేట 41,322 మంది ప్రజల విజయమన్నారు.
ప్రజలు నిత్యం తడి, పొడి, హానికారకమైన చెత్త వేర్వేరుగా ఇవ్వడంతో సాధ్యమైందన్నారు. సిద్దిపేటలో 34 మెట్రిక్ టన్నుల చెత్త ప్రతి రోజు ఉత్పత్తి అవుతున్నదని తెలిపారు. ఇందులో తడి చెత్త 27 లక్షల మెట్రిక్ టన్నులు, 4 మెట్రిక్ టన్నుల పొడి చెత్త, మిగతాది హానికారకమైన చెత్త వస్తుందని చెప్పారు. తడి చెత్తను ఎరువుగా, పొడి చెత్తను రీ సైక్లింగ్‌కు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను సిమెంట్ కర్మాగారానికి విక్రయిస్తున్నట్టు తెలిపారు. చెత్తను వెల్త్ ఆఫ్ వేస్ట్‌గా మార్చుకోవడం సిద్దిపేట మున్సిపాలిటీ గొప్పతనమన్నారు. వీటి ద్వారా ప్రతి నెలా 4,500 కిలోల గ్యాస్, 100 మెట్రిక్ టన్నుల ఎరువుల ఉత్పత్తి అవుతున్నదన్నారు. గ్యాస్ ద్వారా రూ.3 లక్షలు, ఎరువుల ద్వారా రూ.7.3 లక్షలు, పొడిచెత్త ద్వారా రూ.11.30 లక్షలు, మొత్తం రూ.21 లక్షలకుపైగా ఆదాయం చెత్త నుంచి వస్తుందని తెలిపారు.
వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్ పంపిణీ
మార్కెట్ యార్డు ఆవరణలో వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్లను మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశారు. వ్యవసాయ పరికరాలు చిన్న, సన్నకారు రైతులకు అందుబాటులో తేవడానికి, తక్కువ రేటుకు అద్దెకు ఇవ్వడానికి మండల సమాఖ్య ఆధ్వర్యంలో కస్టమ్ హెరింగ్ సెంటర్స్-వ్యవసాయ పరికరాల అద్దె కేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లాలో 21 మండల సమాఖ్యలు-రాయపోల్, సిద్ధిపేట అర్బన్ మినహా సీహెచ్ సీలను రూ.3.05 కోట్లతో ఏర్పాటు చేశామన్నారు.
ఇందులో 75 శాతం, ఎంఎస్ సొంత నిధులు రూ.2.09 కోట్లు, 25 శాతం ఎస్.ఆర్.ఎల్.ఎం రూ.96 లక్షలు వెచ్చించినట్టు వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మెన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మార్కెట్ కమిటీ చైర్మెన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ మంజుల-రాజనర్సు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.