Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురుగుమందు డబ్బాలతో అన్నదాతల ఆందోళన
- చేతులెత్తేసిన నీటిపారుదలశాఖ అధికారులు
నవతెలంగాణ - బోనకల్/ వెల్గటూర్
సాగునీరు అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలంటూ ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. ఖమ్మం జిల్లా బోనకల్, మధిర మండలాల్లోని ఏడు గ్రామాల అన్నదాతలు పురుగుమందు డబ్బాలు చేత పట్టుకొని వైరా- జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై వత్సవాయి- బోనకల్ గ్రామాల మధ్య ఆందోళనకు దిగారు. మధిర మండలం అల్లినగరం, మడుపల్లి, బయ్యారం, దేశినేనిపాలెం, ఇల్లూరు, రాయపట్నం, బోనకల్ మండల పరిధిలోని మోటమర్రి గ్రామాలకు చెందిన సుమారు 200 మంది రైతులు ఎండి పోయిన మిర్చి చెట్లను, పురుగుమందు డబ్బాలను తీసుకొని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు శాఖమూరి కోటేశ్వరరావు, సూర్యదేవర సాంబశివరావు మాట్లాడుతూ.. ఈ గ్రామాల్లో మొత్తం 7 వేల ఎకరాల్లో మొక్కజొన్న, వరి, మిర్చి పంటలను సాగుచేసినట్టు తెలిపారు. అధికారులతో మాట్లాడితే వెంటనే నీటిని సరఫరా చేస్తామని సమాధానం చెప్తారని ఆ తర్వాత అధికారులు ఇచ్చిన హామీ కూడా అమలు చేయడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 14న నీటిని విడుదల చేసి 22 వరకు ఇచ్చారని, జనవరి 29న నీటిని విడుదల చేసి ఫిబ్రవరి 4 వరకు ఇచ్చారని, ఫిబ్రవరి 12న నీటిని విడుదల చేసి 18 వరకు ఇచ్చారని, ఈ సమయంలో కూడా ఏనాడూ సాగర్ నీరు సక్రమంగా రాలేదని రైతులు తెలిపారు. ఆ తర్వాత నీటిని పూర్తిగా బంద్ చేశారని తెలిపారు. రెండు నెలల కాలంలో కేవలం 20 రోజులు మాత్రమే దాములూరు మేజర్‌కు సాగర్ నీటిని విడుదల చేశారన్నారు. 20 రోజుల్లో పంటలన్నీ ఎలా తడుస్తాయని ప్రశ్నించారు. ఆందోళన సమయంలో నీటిపారుదల శాఖ అధికారులతో రైతులు ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు.
కానీ వారు స్పష్టమైన సమాధానం చెప్పకుండా చేతులెత్తేయటం విశేషం. బోనకల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. దాంతో రైతులు తమకు స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు ఎట్టకేలకు మూడు గంటల అనంతరం రైతులు ఆందోళన విరమిం చారు. కార్యక్రమంలో రైతులు పాటిబండ్ల గిరిబాబు, చంపసాల గోపాలరావు, ధరావత్ చిట్టిబాబు, మర్రి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ఉండెడ ఎక్స్ రోడ్డు వద్ద మూడు గ్రామాల రైతులు రాజారాంపల్లి బసంత్ నగర్ రోడ్డుపై, రాస్తారోకో చేపట్టి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వందల ఎకరాల్లో కష్టించి సాగు చేసిన పంట పొలాలు నోటికొచ్చే దశలో ఎండిపోతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కోసం తాము భూములను దానం చేస్తే చివరికి మాకు ఉన్న భూములకు ప్రభుత్వం సాగునీరు అందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎల్లంపల్లి పంపు హౌస్ కోసం అండర్ గ్రౌండ్ నిర్మాణాలు చేపట్టి ఎస్సారెస్పీ డి83 మెయిన్‌కి అనుసంధానంగా ఉన్న కాలువను పూడ్చివేసి సాగునీరు సరఫరాకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తున్నారని విమర్శించారు. ఎల్లంపల్లి పంపు హౌస్‌లను స్టార్ట్ చేసి ఎయిర్ వాల్వ్‌ల ద్వారా సాగునీరు అందించి పంట పొలాలను రక్షించాలని అధికారులను వేడుకొన్నారు. ప్రభుత్వం స్పందించ కుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్టు హెచ్చరించారు.