Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించండి
- అధికారులకు మంత్రి సబిత ఆదేశం
- హాజరు కానున్న 9,51,022 మంది విద్యార్థుల
- 1,473 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చేనెల 15 నుంచి ఏప్రిల్ నాలుగో తేదీవరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ పరీక్షలకు 9,51,022 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు విద్యార్థులు ఉదయం 8.45 గంటలకే కేంద్రాల్లోకి వచ్చి తమ స్థానాల్లో కూర్చోవాలని కోరారు. లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో హైపవర్ కమిటీలను కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేశామనీ, పరీక్షల నిర్వహణ బాధ్యత ఈ కమిటీలదేననీ మంత్రి స్పష్టం చేశారు. జిల్లాల్లో అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలను నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో నిఘా ఉంచేందుకు, పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన సదుపాయాలు కల్పించాలనీ, తప్పనిసరిగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరీక్షా కేంద్రాలకు సమయానికి విద్యార్థులు చేరుకునే విధంగా బస్సులను నడపడం జరుగుతుం దని పేర్కొన్నారు. పరీక్షల సంద ర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే పరిష్కరిం చేందుకు ప్రతి జిల్లాకూ ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.