Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
- పేదలంతా ఐక్యంగా పోరాడితేనే ఇండ్లు, ఇండ్ల స్థలాలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్
నవతెలంగాణ-భూపాలపల్లి/గోవిందరావుపేట
ఇండ్ల స్థలాల కోసం పట్టాలు ఇచ్చేంతవరకూ పోరాటం ఆపేదే లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ప్రభుత్వ స్థలాల్లో నిరుపేదలు గుడిసెలు వేసుకున్న ప్రాంతాలను మంగళవారం ఆయన సందర్శించి గుడిసెవాసులను ఉద్దేశించి మాట్లాడారు. భూపాలపల్లి పట్టణంలోని పాత ఎర్ర చెరువు శిఖం భూమిలో సర్వే నెంబర్-280, 283, 284, 285లోని సుమారు 24 ఎకరాల్లో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 28 రోజులు కిందట సుమారు 3500 గుడిసెలు వేసుకున్న విషయం తెలిసిందే. వీరికి మద్దతు తెలిపేందుకు మంగళవారం వచ్చిన సుదర్శన్‌కు గుడిసెవాసులు బైక్‌ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. సీఆర్ నగర్ నుంచి గుడిసెల ప్రాంతం వరకు కోలాటాలు డప్పు చప్పుళ్లు, నృత్యాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లా కార్యదర్శి బందు సాయిలు అధ్యక్షతన జరిగిన గుడిసెవాసుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు నిరుపేదలకు సొంత ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టిన పాపాన పోలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించినా ప్రజలకు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భూ పోరాటాలు జరుగుతున్నాయని అన్నారు. రోజుకు రూ.500 కూలీకి వెళ్తూ తినితినక.. అద్దె భవనాల్లో, ఇరుకు గదుల్లో జీవిస్తుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పేదలు రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లోని 52 సెంటర్లలో వేలమంది నిరుపేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సభలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దామర కిరణ్, నాయకులు కంపేట రాజన్న, చెన్నూరు రమేష్, పొలం రాజేందర్, జిల్లా కమిటీ సభ్యులు, గుడిసెవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న వారికి మద్దతు తెలిపి మాట్లాడారు. గూడు లేని నిరుపేదలంతా ఐక్యంగా పోరాడితేనే ఇండ్లు, ఇండ్ల స్థలాలు దక్కుతాయని స్పష్టంచేశారు. బీజేపీ ప్రభుత్వం పేదలను పట్టించు కోకుండా బడాబడా పారిశ్రామికవేత్తలకు వేలకు వేల ఎకరాలు నామ మాత్రపు ధర కన్నా అతి తక్కువ ధరకు కట్టబెడుతోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది పేదలు ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేస్తుం టే మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ఈటల రాజేందర్ టిఫిన్ చేసేందుకు అసెంబ్లీ హాల్లో తనకు రూమ్ లేదని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంద న్నారు. ప్రజా ప్రయోజనాల కన్నా స్వప్రయోజనాలకి ప్రాధాన్యతను ఇస్తూ ఆ పార్టీ తన ఆలోచన విధానాన్ని అసెంబ్లీ సమావేశాల సాక్షిగా బయ టపెట్టిందని తెలిపారు. కమ్యూనిస్టులు నిరంతరం పేద ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలు నిర్వహిస్తు న్నామని తెలిపారు. ఎన్నో వ్యయ ప్రయాస పడి పోరాడి, అరెస్టులకు భయ పడకుండా మహిళలు చూపిన పోరాట పటిమ వెలకట్టలేనిదన్నారు. మార్చి నెలలో పార్టీ ఆధ్వర్యంలో గుడిసె వాసుల పట్టాల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, జిల్లా నాయకులు, పొదిళ్ల చిట్టిబాబు, బీరెడ్డి సాంబశివ, సామ చంద్రారెడ్డి, అంబాల పోశాలు తదితరులు పాల్గొన్నారు.