Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటి విలువ వంద కోట్లు
- అసైన్డ్, దేవాదాయ భూములే టార్గెట్
- సంగారెడ్డి పట్టణంలో 403 సర్వే నెంబర్లో కబ్జా
- శివ్వంపేట, హత్నూర, కందిలోనూ ఆక్రమణలు
కబ్జాలకు కాదేదీ అనర్హం అన్నట్టుగా.. ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు రియల్టర్లు, రాజకీయ నాయకుల కన్నుబడుతోంది. నిబంధనలకు పాతరేసి కబ్జాలకు పాల్పడుతున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల భూములకు డిమాండ్ పెరిగింది. సంగారెడ్డి, జిన్నారం, కంది, హత్నూర, శివంపేట వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల కాజేస్తున్నారు.
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డి జిల్లాలో ఐఐటీ హైదరాబాద్, 3 మెడికల్ కళాశాలలు, హైదరాబాద్-ముంబయి, కంది-నాందేడ్ ప్రధాన రహదారులున్నాయి. సంగారెడ్డి పారిశ్రామిక కేంద్రంగానే కాకుండా జాతీయ విద్యా సంస్థలుండటంతో భూములకు డిమాండ్ పెరిగింది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, విద్యా సంస్థలు విస్తరిస్తున్నాయి. పెద్ద పెద్ద వెంచర్లు, అపార్ట్మెంట్స్, కాలనీలు వెలుస్తున్నాయి. దాంతో ప్రభుత్వ భూములపై కన్నేశారు. ఎక్కడ అసైన్డ్, చెరువు శిఖం, దేవాదాయ భూములు కనిపించినా ఆక్రమించేయడం, నకిలీ పత్రాలు సృష్టించి నిర్మాణాలు చేయడం పరిపాటిగా మారింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాజంపేట రోడ్డు చౌహన్ పంక్షన్‌హాల్ ఎదురుగా 403 సర్వే నెంబర్లో 11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు ఇండ్లు కట్టించారు. రామచంద్రారెడ్డి కాలనీ పేరిట పేదలు నివసిస్తున్నారు. ఈ కాలనీ ముందు రాజంపేట-ముంబయి హైవే బైపాస్కు వెళ్లే ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి 2 ఎకరాలు కొందరు కబ్జా చేశారు. రోడ్డు పేస్ కావడంతో గజం ధర రూ.50 వేలపైనే ఉంది. కాలనీ ప్రజలు మూడు నెలల కిందట అధికారులకు ఫిర్యాదు చేశారు. సర్వే చేసిన తహసీల్దార్ 403 సర్వే నెంబర్లో ఉన్న భూమంతా ప్రభుత్వ భూమేనంటూ నిర్ధారించారు.
కబ్జాదారులు కట్టిన గోడను కూల్చారు. ఇటీవల అధికార పార్టీ నాయకుడితో పాటు ఇతరులు రూ.20 కోట్ల విలువ చేసే భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. రోడ్డు అవతలి భాగంలో 239 సర్వే నెంబర్లో ఉన్న భూముల్ని అమ్ముకున్న కొందరు ప్రభుత్వ భూమిలోని 403 సర్వే నెంబర్లో తమ భూమిగా నకిలీ డాక్యుమెంట్లు చూపుతూ కబ్జాకు పాల్పడుతున్నారు.
గుమ్మడిదల మండలం హైదరాబాద్-నర్సాపూర్ ప్రధాన రహదారికి ఆనుకుని అన్నారం గ్రామంలో 261 సర్వే నెంబర్ భూమి రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండటంతో వివాదస్పదంగా మారింది. మొత్తం 588 ఎకరాల్లో 315 ఎకరాల వరకు పట్టా భూమి ఉంది. మిగతాదాంట్లో ఇందిరమ్మ కాలనీ, కేసీఆర్ కాలనీ, డంపింగ్ యార్డ్, ఈద్గా, శ్మశానవాటికల ఏర్పాటు కోసం 37 ఎకరాలను కేటాయించారు. మూడు దశాబ్దాల కిందటే 117 ఎకరాల భూమిని 108 మంది రైతులకు అసైన్డ్ చేశారు. ఇదే సర్వే నెంబర్లో 20 ఏండ్ల కిందట మాజీ సైనికులకు 119 ఎకరాల్ని ప్రభుత్వం కేటాయించింది.
ఏండ్లు గడుస్తున్నా కొంత మంది మాజీ సైనికులు పొజిషన్లో లేకపోవడంతో వారికి కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో 75 ఎకరాల్లో 17 మంది మాజీ సైనికులు మాత్రమే పొజిషన్లో ఉన్నారు. 119 ఎకరాలను కేటాయించిన తర్వాత కేవలం 75 ఎకరాల్లో మాత్రమే సైనికుల కుటుంబాలు పొజిషన్లో ఉండటంతో 44 ఎకరాల భూమి ఎక్కడ ఉందనేది తేల్చడంలేదు. కొందరు మాజీ సైనికులమంటూ ఇక్కడి భూముల పత్రాలున్నాయంటూ అసైన్డ్ భూమి నాదంటున్నారు. ఇలా 44 ఎకరాల్ని నకిలీ పత్రాలు చూపి కాజేస్తున్నారు. ఎకరం ధర రూ.6 కోట్ల వరకు ఉంది. ఈ లెక్కన రూ.264 కోట్ల విలువ చేసే భూముల్ని కాజేసే ఆక్రమణలు జరుగుతున్నాయి.
సంగారెడ్డి పట్టణానికి ఆనుకుని ఉన్న కందిలో 108 సర్వే నెంబర్లో 77 ఎకరాల భూమి ఉంది. అందులోంచి 20 ఏండ్ల కిందట కొందరు పేదలకు 100 గజాల చొప్పున అసైన్డ్ చేశారు. ఆ ప్లాట్ల పక్కన కొంత అసైన్డ్ భూమి కూడా ఉంది. పేదలను బెదిరించి, కొందరికి డబ్బులిచ్చి పట్టా సర్టిఫికెట్లు పొందిన బడాబాబులు యద్దేచ్ఛగా అసైన్డ్ భూముల్లో పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నారు. ఇలా రూ.10 కోట్ల విలువ చేసే అసైన్డ్ భూముల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. కంది మండలం ఎల్దనూరు గ్రామంలో 45 ఎకరాల ప్రభుత్వ భూమిని 70 మంది రైతులకు అసైన్డ్ చేశారు. రైతులు సాగు చేసుకుంటుండగా ఓ మైనింగ్ కంపెనీ వాళ్లు అట్టి భూముల్ని కబ్జా చేసి కంకర మిల్లు పెట్టి మైనింగ్ చేస్తున్నారు. ఇలా సంగారెడ్డి చుట్టూరా అసైన్డ్, ప్రభుత్వ భూములన్నీ కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. ఫిర్యాదులు వచ్చినప్పుడు సర్వే చేసి చేతులు దులుపుకుంటున్నారు.
హత్నూర మండలంలో బొర్పట్లలో అసైన్డ్ భూముల్ని కాజేసేందుకు ఓ పెద్ద లీడర్ పేదలకు అసైన్డ్ చేసిన స్థలాల్ని గుంజుకున్నాడు. దళితులు ప్రశ్నించే సరికి ఆ స్థలంలో డబుల్బెడ్రూమ్ ఇండ్లు కడుతున్నామని చెప్పి తమకు నచ్చిన వాళ్లకు కట్టబెట్టారు. చింతల్‌చెరువు శివారు తుర్కల్కుంటను పూర్తిగా పూడ్చేసి ఆక్రమించారు. శివంపేట మండలంలో కొంతాన్‌పల్లి కరీంకుంట చుట్టూ కంచె వేసి 3.20 ఎకరాల్ని కొందరు కబ్జా చేశారు. నర్సాపూర్‌లో సర్వే నెంబర్ 79లో ఉన్న భూముత్వ భూముల్లో కొంద పేదలకు పంపిణీ చేశారు. మిగతా భూమిని రియర్టర్లు ఆక్రమించేశారు.
ఫిర్యాదులొస్తే చర్యలు : నగేష్, ఆర్డీఓ సంగారెడ్డి
ప్రభుత్వ భూముల్ని ఎవరు కబ్జా చేసినా చర్యలు తీసుకోబడుతుంది. రామచంద్రారెడ్డి కాలనీ భూమిని సర్వే చేయించి హద్దులు నిర్దారిస్తాం. ఇతర చోట్ల కూడా ఫిర్యాదులొస్తే వెంటనే విచారించి కబ్జాను అరికట్టే ప్రయత్నం జరుగుతుంది.
భూముల్ని కాపాడాలి
403 సర్వే నెంబర్లో 11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పటికీ కొండాపూర్, సంగారెడ్డి టీఫన్, పహాణీలో ప్రభుత్వ భూమిగానే చూపిస్తుంది. అయినా కొందరు 3 వేల గజాలకు పైగా ఉన్న ఖరీదైన భూమిని కబ్జా చేశారు. ఇప్పటికి రెండు సార్లు కట్టడాలను స్థానికులం కూల్చేశాం. అధికారులు కూడా ప్రభుత్వ భూమియేనని నిర్దారించారు. కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా నాన్చుతున్నారు. ఎస్సీ, కలెక్టర్ స్పందించి ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా కాపాడి పేదలకు ఇండ్ల స్థలాలివ్వాలి.
- అశోక్, సంగారెడ్డి