Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాణత్యాగమే కాదు... నిర్బంధంలో సైతం ప్రజల కోసం పనిచేయడం పెద్దసవాల్
- సమసమాజంగా మార్చడమే విప్లవం లక్ష్యం : రెడ్ బుక్స్‌డే కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భగత్‌సింగ్ గొప్ప దేశభక్తుడే కాకుండా పరిణితి చెందిన కమ్యూనిస్టు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. చనిపోవడమే త్యాగం కాదన్నారు. పాలకుల నిర్బంధం ఉన్నా ప్రజల కోసం పనిచేయడమే విప్లవకారులకు పెద్ద సవాల్ అనీ, అదే గొప్ప త్యాగమనీ ఆయన వ్యాఖ్యానించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కమ్యూనిస్టు పార్టీని నిర్మించాలనీ, ఆ సిద్ధాంతానికి చివరిదాకా కట్టుబడి ఉండాలనీ చెప్పారు. రెడ్ బుక్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం 'భారత విప్లవ కెరటం భగత్‌సింగ్' పుస్తక సామూహిక పఠన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ప్రపంచ మానవాళి విముక్తి కోసం మార్క్స్-ఎంగెల్స్ రచించిన కమ్యూనిస్టు మ్యానిఫెస్టో గ్రంథాన్ని గతేడాది పఠించామన్నారు. ఈ ఏడాది భగత్‌సింగ్ పుస్తకాన్ని చదువుతున్నామని చెప్పారు. హింసద్వారానైనా బ్రిటీష్ వారిని పారదోలాలంటూ భగత్‌సింగ్ భావించారని వివరించారు. పార్లమెంటు మీద బాంబు వేసిన ఘటనలో 1931, మార్చి 23న అతిచిన్న వయస్సులో ఉరికంబం ఎక్కిన గొప్ప దేశభక్తుడు ఆయన అని చెప్పారు. 1925లో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. భారతదేశంలో మార్క్సిజం పట్ల పూర్తిస్థాయి అవగాహన లేని కాలంలో పరిపూర్ణ కమ్యూనిస్టుగా భగత్‌సింగ్ పరిణతి చెందారని అన్నారు. అయితే ప్రగతిశీల భావాలున్న బుద్ధుడు, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ వంటి వారిని కమ్యూనిస్టులు సొంతం చేసుకోలేదని వివరించారు. మనువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించి పోరాడిన అంబేద్కర్‌ను బీజేపీ సొంతం చేసుకుంటున్నదని చెప్పారు. అభ్యుదయ భావాలను ఒడిసి పట్టుకోవాలనీ, అలాంటి వారిని కమ్యూనిస్టు పార్టీ సొంతం చేసుకోవాలని కోరారు. దోపిడీని, అన్యాయాన్ని ఎదిరించడం, సమాజాన్ని మార్చడమే విప్లవమని వివరించారు. సమసమాజంగా మార్చడం విప్లవ లక్ష్యమన్నారు.
దేవున్ని విమర్శించడానికే పరిమితం కావొద్దు
మానవ సమాజాన్ని, డార్విన్ పరిణామ క్రమ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న తర్వాత భగత్‌సింగ్ హేతువాదిగా మారాడని తమ్మినేని చెప్పారు. విమర్శించినంత మాత్రాన మనుషుల భావాల్లోనుంచి దేవుడు పోడని అన్నారు. దేవుడు ఎందుకు అవసరమయ్యారనే, ఆ కారణాన్ని తార్కికంగా ఆలోచించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. 'హృదయం లేని సమాజంలో హృదయం లాంటివాడు, ఊరటలేని సమాజంలో ఊరటనిచ్చే వాడు దేవుడు. అందుకే మతం మత్తు మందు లాంటిది'అంటూ మార్క్స్ అన్నారని గుర్తు చేశారు. అంటే దేవుని అవసరం లేకుండా చేయాలన్నారు. ప్రజల కన్నీళ్లు, కష్టాలు, ఇబ్బందులు, దోపిడీ, పీడన, వివక్ష, నిరక్షరాస్యత, నిరుద్యోగం, పేదరికం లేకుండా చేయాలని కోరారు. అంతే తప్ప దేవున్ని విమర్శించడం వరకే పరిమితం కావొద్దని పార్టీ కార్యకర్తలకు ఆయన సూచించారు. క్రమశిక్షణ ద్వారా కాకుండా విషయ విశ్లేషణ ద్వారా చైతన్యాన్ని పెంపొందించాలని సూచించారు. దేవుడుంటే మనుషులంతా సమానంగా ఎందుకు లేరని ప్రశ్నించారు. దీనికి పెట్టుబడిదారీ విధానమే కారణమని విమర్శించారు. అందుకే భగత్‌సింగ్ తీవ్రవాది నుంచి మార్క్సిస్టుగా మారాడని గుర్తు చేశారు. మార్క్స్, లెనిన్ రచనలు చదివిన ఆయన భారత విప్లవ కార్యక్రమం ఎలా ఉండాలో ప్రతిపాదించారని అన్నారు. గ్రూపులు, హింస, తుపాకుల ద్వారా విప్లవం రాదని తమ్మినేని వ్యాఖ్యానించారు.
సాధారణ ప్రజలను సమీకరించి పోరాడితేనే విప్లవం వస్తుందంటూ భగత్‌సింగ్ చెప్పారని గుర్తు చేశారు. రైతాంగం, కార్మికుల్లో చైతన్యం పెంచినప్పుడే విప్లవం జయప్రదమవుతుందని వివరించారు. తాత్కాలిక కోర్కెల కోసం రాజీపడాలనీ, అంతిమ లక్ష్యాన్ని వీడొద్దని సూచించారు. వ్యక్తిగత జీవితం కంటే సిద్ధాంతం ఎంతో గొప్పదని చెప్పారు. వృత్తి విప్లవకారులు ఆ దిశగా పయనించాలని కోరారు. భగత్‌సింగ్‌ను ప్రతిఒక్కరూ మార్గదర్శిగా తీసుకోవాలని సూచించారు.
రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ : బి వెంకట్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నదని సీపీఐ(ఎం) పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్ విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మనుధర్మాన్ని అమలు చేయాలనీ, హిందూ రాజ్యాన్ని నిర్మించాలనీ బీజేపీ కుట్ర పన్నుతున్నదని చెప్పారు. ఈ రాజ్యాంగముంటేనే దేశ ప్రజలు ఐక్యంగా ఉంటారనీ, హక్కులు పరిరక్షించబడతాయనీ, ప్రభుత్వరంగ సంస్థలుంటాయనీ వివరించారు. పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంచుకోవాలనీ, సమాజాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. అధ్యక్షత వహించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి సాగర్ మాట్లాడుతూ సామూహిక పుస్తక పఠనం కార్యక్రమం వచ్చేనెల 23 (భగత్‌సింగ్ వర్ధంతి) వరకు కొనసాగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు, టి జ్యోతి, మల్లు లక్ష్మి, పి ప్రభాకర్, హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.