Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావుకు కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్ జీసీసీఎల్‌ఏ-475) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు బుధవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ ఆన్లైన్ ద్వారా వినతిపత్రాన్ని పంపించారు. గత డిసెంబర్‌కు సంబంధించి కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాలను ఆయా జిల్లాల కోశాధికారులు ఆమోదించి ఈ కుబేర్‌లో అప్లోడ్ చేశారని తెలిపారు. వాటికి టోకెన్ నెంబర్లు కూడా వచ్చాయని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేయకపోవడంతో వేతనాలు వారి అకౌంట్లలో జమ కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా వేతనాల్లేకపోవటం వల్ల బ్యాంకు అప్పులకు సంబంధించి నెలవారి చెల్లింపులు, ఇంటి అద్దెలు చెల్లించటానికి, ఆరోగ్యం, పిల్లల చదువుల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆర్థిక శాఖ మంత్రి జోక్యం చేసుకుని టోకెన్ నెంబర్లు వచ్చిన కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాలు చెల్లించడానికి చొరవ చూపాలని కోరారు. శాసనసభ, శాసనమండలిలో ఏప్రిల్ ఒకటో తేదీన కాంట్రాక్టు అధ్యాపకులు, ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ ఆర్థిక మంత్రి ప్రకటనను స్వాగతిస్తూ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.