Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్, ఎండీ సమక్షంలో ఒప్పందం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఒడిశాకు బస్ సర్వీసులు నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో పది సర్వీసుల్ని నడిపేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య ఒప్పందం కుదిరింది. హైదరాబాద్ బస్‌భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్దన్ సమక్షంలో ఎండీ వీసీ సజ్జనార్, ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఓఎస్ఆర్టీసీ) ఎండీ దిప్తేష్ కుమార్ పట్నాయక్ పరస్పరం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
దీని ప్రకారం టీఎస్ఆర్టీసీ ఒడిశాకు పది బస్సులు, ఓఎస్ఆర్టీసీ తెలంగాణకు 13 సర్వీసులను నడుపుతారు. హైదరాబాద్-జైపూర్, ఖమ్మం-రాయఘఢ, భవానిపట్నం - విజయవాడ (వయా భద్రాచలం), భద్రాచలం-జైపూర్ రూట్లలో సర్వీసులు నడుస్తాయి. ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఓఎస్ఆర్టీసీ ఓఎస్డీ దీప్తి మహాపాత్రో, ట్రాన్స్‌ఫోర్ట్ ప్లానర్ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.