Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశాన్ని దోచుకుంటున్న మతోన్మాద, కార్మొరేట్ శక్తులు
- మార్చి 15 నుంచి ఉద్యమాలతో ప్రజల్లో చైతన్యం :విలేకరుల సమావేశంలో చెరుపల్లి, జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
మోడీ, అదానీల బంధం దేశానికి ప్రమాదకరంగా మారిందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో బుధవారం వారు విలేకర్లతో మాట్లాడారు. షేర్‌మార్కెట్ అతలాకుతలం కావడానికి అదానీ కుంభకోణమే కారణమన్నారు. ప్రధాని మోడీ- అదానీల బంధం దేశ భద్రతకు ఆటంకం కలిగిస్తుందన్నారు. మతోన్మాద శక్తులు, కార్పొరేట్ శక్తులు ఏకమై దేశాన్ని దోచుకుతింటున్నాయన్నారు. వాటి ఫలితంగానే కుబేరుల ఆస్తులు పెరుగుతున్నాయని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, కార్మికులకు రుణ మాఫీ చేయని కేంద్ర ప్రభుత్వం.. కార్పొరేట్లకు మాత్రం లక్షల కోట్ల రూపాయలు మాఫీ ఎలా చేస్తుందని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును దోచుకుంటున్న కార్పొరేట్ల కారణంగా ప్రజలపై భారం పడుతుందని వాపోయారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టం, ఆహార భద్రత, అటవీ హక్కుల చట్టం, ధరల నియంత్రణ చట్టం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఐటీ రంగం కుదిలైపోయిందన్నారు. కంపెనీలు అధిక వేతనం ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నాయన్నారు. మోడీకి ఏ మాత్రం నిజాయితీ ఉన్నా అదానీపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రైతులు, కార్మికుల అప్పులను కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోకుండా.. అదానీ అప్పులకు బాధ్యత తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. మతోన్మాదం, కార్పొరేట్, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో సమరశీల ఉద్యమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు జాతాలు ఏర్పాటు చేసి అన్ని మండలాల్లోనూ తిరుగుతూ కేంద్రం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తామని చెప్పారు. ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రజా ఉద్యమాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు రవినాయక్, డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, తిరుపతి రామ్మూర్తి, నాయకులు వాడపల్లి రమేష్, పిల్లుట్ల సైదులు, దైద బిక్షం, రామారావు, వెంకటరెడ్డి, సైదా నాయక్, బాబు నాయక్ ఉన్నారు