Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి
- గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) పాదయాత్రలో కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-మంచాల
గ్రామ పంచాయతీ కార్మికుల్లో 80శాతం మంది దళితులే ఉన్నారని, వారికి కనీసవేతనం రూ.26వేలు ఇవ్వాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు అన్నారు. గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర గురువారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో కొనసాగింది. ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు నుంచి మంచాల మండలం చిత్తాపూర్ మీదుగా అరుట్ల చేరుకుంది. అరుట్ల నుంచి జపాలకు చేరుకుంది. వీరికి పంచాయతీ కార్మికులు స్వాగతం పలికారు. అరుట్ల గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్కైలాబ్ బాబు మాట్లాడారు.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. జీవో నంబర్ 60 ప్రకారం పారిశుధ్య కార్మికులకు, బిల్ కలెక్టర్లకు వేతనాలు పెంచాలని కోరారు. జీవో నంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 1981 నుంచి పనిచేస్తున్న పంచాయతీ కార్మికుల జీవితాల్లో ఇప్పటికీ మార్పు రాలేదన్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యేల వేతనాలు పెంచింది కానీ పంచాయతీ కార్మికుల వేతనాలు పెరగడం లేదన్నారు.
కరోనా సమయంలో పంచాయతీ కార్మికులు తమ ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేశారని గుర్తు చేశారు. కార్మికులకు ఎర్రజెండా అండగా ఉంటుందన్నారు. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ పోరాడుతామన్నారు. పాదయాత్రలో యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గ్యార పాండు, వెంకటయ్య, కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.సామెల్, ఎం.ప్రకాష్ కరత్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డి.జగదీష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్, జిల్లా ఉపాధ్యక్షులు నాగిళ్ల శ్యామ్సుందర్, సీఐటీయూ మండల కన్వీనర్ పోచమొని కృష్ణ, కేవీపీఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శి గడ్డం యాదగిరి, డాక్టర్ కొండిగారి బుచ్చయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల యాదయ్య, కాళ్ళ జంగయ్య, నాయకులు, తదితరులు ఉన్నారు.