Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో కేఎంసీ గేటు ఎదుట ధర్నా
నవతెలంగాణ-మట్టెవాడ
కేఎంసీ అనస్తీషియా పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), ఐద్వా ఆధ్వర్యంలో వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల గేటు ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. బాధితురాలికి న్యాయం చేయాలని, కళాశాలల్లో ర్యాగింగ్‌ను తరిమికొట్టాలని, మహిళలపై వేధింపులను అరికట్టాలని, ప్రీతి లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎస్ఎఫ్ఐ, ఐద్వా నాయకులతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి మడికొండ వద్ద నున్న మిల్ట్రీ ట్రైనింగ్ బేస్ క్యాంపునకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిశ్రిన్ సుల్తానా, ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి నళిగంటి రత్నమాల, భవాని మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలో ప్రీతి ఆత్మహత్యాయత్నం సంఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. ర్యాగింగ్‌పై పర్యవేక్షణ కమిటీ లేకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తుందని ఇలాంటి సంఘటనలు పదేపదే జరుగుతున్నాయని అన్నారు. మెడికో ప్రీతి వేధింపులకు సంబంధించి ఆరు నెలలుగా సీనియర్ పీజీ వైద్యుడు సైఫ్ మానసికంగా వేధిస్తున్నాడని బాధితురాలు కళాశాల ప్రిన్సిపాల్‌కు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడం వల్లే ప్రీతి కొన ఊపిరితో కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మెరిట్ విద్యార్థిని ఈ పరిస్థితికి తీసుకువచ్చిన ర్యాగింగ్, వేధింపులను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని వేధింపులకు బలవుతున్న బాధితుల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పీజీ వైద్య విద్యార్థినికి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చుక్క ప్రశాంత్, యారా ప్రశాంత్ రెడ్డి, కేడీసీ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్, అభిలాష్, కరీమాబాద్ ఏరియా కార్యదర్శి రాజకుమార్, సందీప్, ఇర్ఫాన్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.