Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెలికాన్ఫరెన్స్లో కాసాని దిశానిర్ధేశం
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ అంతటా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని వచ్చే పది రోజుల పాటు ఉద్యమస్థాయిలో విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ నేతలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలుచేసిన అభివద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలనీ, తద్వారా తిరిగి వారి ఆశీర్వాదం పొందాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి ప్రారంభమైన ఇంటింటికీ తెలుగుదేశం కార్యకమం కొనసాగింపుపై కాసాని పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో మాట్లాడుతూ ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సక్సెస్ చేయాలని చెప్పారు. అన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కార్యక్రమాన్ని ప్రారంభించారా ? లేదా అని నాయకులను ఆరా తీశారు. మంగళవారం ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. బుధవారం మహబూబ్నగర్ , మల్కాజ్గిరి, మహబూబాబాద్, చేవెళ్ల, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. కుత్బుల్లాపూర్, ఖమ్మం, సత్తుపల్లి, మధిర, వైరా, పినపాక, వికారాబాద్, షాద్నగర్, కరీంనగర్ కార్పోరేషన్, ఆర్మూర్ తదితర అసెంబ్లీ నియోజకవర్గాలో పార్టీ నాయకులు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఇదే క్రమంలో అన్నివర్గాల ప్రజలను పార్టీలోకి అహ్వానించి చేర్చుకోవాలనీ, భారీగా పార్టీ సభ్యత్వాలను నమోదు చేయాలని సూచించారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ప్రధాన లక్ష్యమైన పార్టీ పునర్ నిర్మాణం దిశగా గ్రామ వార్డు స్థాయి నుంచి మండల పార్టీ కమిటీలను తప్పనిసరిగా నియామకం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ సజావుగా జరిగేలా పార్లమెంటు పరిశీలకులు, అసెంబ్లీ కో-అర్డినేటర్లు మండల స్థాయి నాయకులతో సమన్వయం చేసుకోవాలని కోరారు.