Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు సబితా విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రేషన్‌షాపుల్లో మోడీ బొమ్మ వేయనందుకు బాధపడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...సిలిండర్ ధర పెంచడంతో ప్రజలు బాధపడుతున్నారనీ, ఆ ధరలు పెంచిందోవరో తెలియాలంటే వాటిపై మోడీ బొమ్మ వేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. బుధవారం అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవిలతో కలిసి సబితా విలేకర్లతో మాట్లాడారు. ఎనిమిదేండ్లుగా మోడీ ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తుందేమో అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. మంచి చేయకపోగా ధరలు విపరీతంగా పెంచేస్తున్నారని విమర్శించారు. తాజాగా సిలిండర్ ధర రూ. 50 రూపాయలు పెంచారని గుర్తు చేశారు. త్వరలోనే మహిళా దినోత్సవం రానున్న నేపథ్యంలో మోడీ సిలిండర్ ధర పెంచి మహిళలకు కానుక ఇచ్చారని ఎద్దేవా చేశారు. బీజేపీ అంటే ప్రజల జేబులు ఖాళీ చేసే పార్టీగా మారిందన్నారు. ధరలు పెంచడం... ప్రజలను ముంచడం బీజేపీ విధానంగా మారిందని విమర్శించారు. ఆదానీ ఆస్తులు కరిగిపోతున్నాయనీ, ఇప్పుడు ధరలు పెంచి ప్రజల ఆస్తులు కూడా కరిగిపోయేలా చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. మహిళలపై మోడీ వివక్షకు సిలిండర్ ధరల పెంపు ఓ ఉదాహరణ అని తెలిపారు. ప్రజలు గ్యాస్ పొయ్యి నుంచి మళ్లీ కట్టెల పొయ్యికి మళ్లేలా ధరలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు మోడీని దేవుడు అంటున్నారనీ, ధరలు పెంచుతున్నందుకు మోడీ దేవుడిలా కనపడుతు న్నారా? అని ప్రశ్నించారు. మహిళలు వంటింటికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి తెచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వానికి మహిళలే చరమ గీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. మహిళలు బీజేపీకి వ్యతిరేకంగా సంఘటితం కావాలనీ, గురు, శుక్రవారాల్లో నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు.
సాత్విక్ ఆత్మహత్య...ఆ ఆరోపణలన్నింటిపై విచారణ జరిపిస్తాం
విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య బాధాకరమని.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడికి గురి చేయవద్దని స్పష్టం చేశారు. ఒత్తిడి ఉండకూడదనే ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ తీసేయాలని ముఖ్యమంత్రి చెబుతున్నారని తెలిపారు. సాత్విక్ ఆత్మహత్య విషయంలో వస్తున్న ఆరోపణలన్నింటిపై విచారణ జరిపిస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.