Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్‌పై బీజేపీ, ఆర్ఎస్ఎస్, భజరంగ్‌దళ్, హిందూవాహిని కార్యకర్తలు మూకుమ్మడిగా పోలీస్ వాహనంలోకి చొరబడి విచక్షణారహితంగా దాడిచేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడ్డ ఆ దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరింది. నరేష్‌కు రక్షణ కల్పించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిద్ధాంతాలు, నమ్మకాలను చట్టానికి లోబడి ప్రచారం చేసుకునే హక్కు పౌరులకు రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. హన్మకొండ ఆదర్శ లా కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న నరేష్ అంబేద్కర్ భవన్లో విద్యార్థుల ఫ్రెషర్స్ పార్టీలో పాల్గొనేందుకు వెళ్లారని తెలిపారు. బీజేపీ, దాని అనుబంధ సంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడిన విషయాన్ని నరేష్ గమనించి పోలీసుల రక్షణ కోరాడని వివరించారు. వారి రక్షణతో పోలీస్ వాహనంలో ఉండగానే, దాన్ని అడ్డగించి విచక్షణారహితంగా దాడి చేయడంతో నరేష్ గాయాల పాలయ్యారని పేర్కొన్నారు. పోలీసులు అడ్డుకోకపోతే నరేష్ ప్రాణాలకే ముప్పు కలిగేదని తెలిపారు. ఈ కాలంలో మతోన్మాదుల దాడులు, అరాచకాలు పేట్రేగుతున్నాయని విమర్శించారు. భౌతికంగా దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే ఈ తరహా దాడులను ప్రజాస్వామ్యవాదులంతా ప్రతిఘటించాలని కోరారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే దానికి క్షమాపణ కూడా కోరిన నరేష్‌పై ఈ రకంగా వెంటాడి, వేటాడి దాడికి పూనుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
బైరి నరేష్‌కు తగిన రక్షణ కల్పించాలి :
స్వేచ్ఛ జేఏసీ
భైరి నరేష్‌కు తగిన రక్షణ కల్పించాలని స్వేచ్ఛ జేఏసీ డిమాండ్ చేసింది. ఆయనపై పోలీసుల సమక్షంలో మతోన్మాదుల దాడి చేయడం అప్రజా స్వామికం, రాజ్యాంగ వ్యతిరేకమంటూ ఖండించింది. వందకు పైగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా, పౌర సంఘాలతో ఏర్పడిన స్వేచ్ఛ జేఏసీ కన్వీనర్ టి.రమేష్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆడుతున్న రాజకీయ వికృత క్రీడనే ఈ మతోన్మాదం మూకదాడులని పేర్కొన్నారు. వీటిని ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండించాలని కోరారు. రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య రక్షణ నేడు ప్రజల బాధ్యతగా మారిందని అభిప్రాయపడ్డారు.ఉన్మాద శక్తులకు తోడ్పడే విధంగా హేతువాదులు, నాస్తికులు, భౌతికవాదులు, అంబేద్కర్ వాదులు వ్యవహరించకుండా అత్యంత జాగ్రత్తతో మాట్లాడాలని సూచించారు. ప్రభుత్వం ఇలాంటి ఘటన పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే మతోన్మాదులను సమర్ధించినట్టేనని స్పష్టం చేశారు. పోలీసులు తమ ఆధీనంలో, తమ వాహనంలో ఉన్న వ్యక్తికి రక్షణ కల్పించ లేకపోతే ఇక రాష్ట్రాన్నేం కాపాడుతారు? అని ప్రశ్నించారు. ప్రయాణంలో ఉన్న పోలీస్ వాహనాన్ని పట్టుమని పదిమంది కూడా లేని గుంపు ఆపి, అంతసేపు కొట్టటం, బట్టలు తొలగించటం జరుగుతున్నా పోలీసులు లాఠీ కూడా ఉపయోగించకుండా కాలయాపన చేయటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ రక్షణలో ఉన్న వ్యక్తిని ఒక నేరస్త గుంపుకు అప్పగించిన పోలీసులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.