Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుడిసె వాసులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలి
- ప్రజల సందేహాలపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి : ప్రజాసంఘాల పోరాట వేదిక కన్వీనర్
ఎస్ వీరయ్య డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని అర్హులైన పేద ప్రజలందరికీ ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలను ప్రభుత్వం ఇవ్వాలని ప్రజాసంఘాల పోరాట వేదిక కన్వీనర్ ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న మొదటి ప్రాధాన్యత కల్పించాలనీ, వారికి 120 గజాల ఇంటి స్థలం కేటాయించాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 58, 59 ద్వారా పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించడం పోరాటాల ఫలితమేనని చెప్పారు. దానివల్ల కోటి కుటుంబాలకు లబ్ది చేకూరుతుందంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారని అన్నారు. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ మాత్రం 59 జీవో పరిధిలోకి వచ్చే 45 వేల మంది దరఖాస్తులు, 58 జీవో పరి5ధిలోకి వచ్చే 19 వేల మంది దరఖాస్తులు కలిపి మొత్తం 64 వేల మందికి లబ్దిచేకూరుతుందంటూ ప్రకటించారని గుర్తు చేశారు. మంత్రి కేటీఆర్ ప్రకటించినట్టు ఆ కోటి కుటుంబాలు ఎవరని ప్రశ్నించారు. అందులో రాష్ట్రవ్యాప్తంగా గుడిసెలు వేసుకున్న 28 వేల మంది పేదల ప్రస్తావన లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పేద ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని చెప్పారు. పోలీసులు దాడి చేసినా, మౌలిక సదుపాయాలు కల్పించకున్నా వారు ఆ గుడిసెల్లోనే ఉంటున్నారని అన్నారు. 120 గజాల చొప్పున గుడిసె వాసులందరికీ ఇంటిస్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు దరఖాస్తు చేసుకున్న వారికి హక్కు పత్రాలివ్వాలని కోరారు. ప్రజల్లో ఉన్న సందేహాలపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకుంటే సహించేది లేదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో భూపోరాట కేంద్రాల్లో పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిజి నరసింహారావు మాట్లాడుతూ 30 రోజులపాటు సమయమిచ్చి ప్రభుత్వ భూముల్లో ఉండే పేదల నుంచి మళ్లీ దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. 2016లో 58 జీవో ద్వారా దరఖాస్తులను స్వీకరించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ దరఖాస్తులను స్వీకరించలేదని అన్నారు. నిర్దిష్ట కాలపరిమితి విధించి ప్రభుత్వ భూముల్లో ఉండే పేదల నుంచి దరఖాస్తులను తీసుకుని వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణం కోసం రూ.ఐదు లక్షల చొప్పున ఇవ్వాలన్నారు. అప్పుడే వారు ఇండ్లు కట్టుకోవడానికి వీలవుతుందని చెప్పారు. ప్రభుత్వ భూముల్లో పేదలుండే ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇండ్లులేవని తేలిందని గుర్తు చేశారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా కోటి కుటుంబాలకు లబ్ది చేకూరుతుందంటూ మంత్రి కేటీఆర్ ఏ గణాంకాల ప్రకారం ప్రకటించారని ప్రశ్నించారు. మిగిలిన లబ్దిదారులెవరో ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 26,635 మంది లబ్దిదారులు, పట్టణాల్లో 46 వేల మంది లబ్దిదారుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వాటిని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె ఈశ్వర్రావు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.