Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ అమలు చేయాలి
- రాష్ట్ర వ్యాప్తంగా మూడ్రోజులపాటు సమ్మె
- తొలిరోజు ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద ధర్నా
నవతెలంగాణ- విలేకరులు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ధర్నా చేశారు. రాజేంద్రనగర్ సీపీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొడంగల్ చౌరస్తా నుంచి ఐసీడీఎస్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
మూడ్రోజుల సమ్మెలో భాగంగా అంగన్వాడీలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల ఎదుట ఆందోళన చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రాజెక్టు కార్యాలయం ఎదుట యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంకటమ్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి సీడీపీఓకు వినతిపత్రం అందజేశారు. ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నార్నూర్‌లో యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు సుభద్ర ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నిర్మల్ జిల్లా ముధోల్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ప్రాజెక్టు ఆందోళన చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ త్రివేణి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
నిజామాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట నిజామాబాద్ అర్బన్, డిచ్పల్లి ప్రాజెక్టులకు చెందిన అంగన్వాడీలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి ధర్నా చేపట్టారు. బోధన్, ఆర్మూర్ ఆర్డీవో కార్యాలయాలతో పాటు మద్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లు భారీ ప్రదర్శనగా ఐసీడీఎస్ కార్యాలయం వద్దకు వెళ్లి ధర్నా నిర్వహించారు. అనంతరం సీడీపీవో కనకదుర్గకు వినతి పత్రం అందజేశారు. స్పందించిన సీడీపీవో తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని, మిగిలిన సమస్యలను పై అధికారులకు తెలియజేస్తానని హామీ ఇచ్చారు. ఇల్లందు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. దమ్మపేటలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అశ్వారావుపేటలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
ఖమ్మం జిల్లా మధిరలో మానవహారం నిర్వహించారు. అక్కడి నుంచి ర్యాలీగా సీడీపీవో కార్యాలయానికి వెళ్లి ఆందో ళన చేశారు. అనంతరం సీడీపీవోకు వినతిపత్రం అందజే శారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మ రూరల్ మండలంలో సీడీపీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, అంగన్వాడీ టీచర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా కార్యదర్శి కె.సమ్మక్క ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐసీడీఎస్ కార్యాలయాల ఎదుట అంగన్వాడీ టీచర్లు 72 గంటలపాటు సమ్మె చేపట్టారు. మెదక్ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం నుంచి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఆందోళ చేపడుతున్న అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి నర్సమ్మతోపాటు అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విడుదల చేశారు. సిద్దిపేటలో సీడీపీఓ కార్యాలయం వద్ద భారీ ధర్నా చేపట్టారు.