Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వమే పట్టాలిచ్చింది.. సదరు ఇండ్ల స్థలాలను సర్కారే జీవో నెం 58 కింద క్రమబద్ధీకరించింది.. దశాబ్దాలుగా అక్కడే నివాసముంటున్న పేద కుటుంబాలను కనీసం నోటీసు ఇవ్వకుండా అర్ధరాత్రి రోడ్డు మీద పడేయడం అన్యాయం.. అత్యంత అమానుషమని సీపీఐ(ఎం) ఆగ్రహం వ్యక్తం చేసింది. నియంత, మిలటరీ ప్రభుత్వాలూ ఇంత దుర్మార్గంగా వ్యవహరించవంది. అక్రమంగా కూల్చివేసిన ఎర్రమంజిల్ కాలనీ గుడిసె వాసులకు ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం పార్టీ ప్రతినిధుల బృందం హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి సూర్యలతను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ.. నగరం నడిబొడ్డున నిమ్స్ ఆస్పత్రి పక్కనే గల ఎర్రమంజిల్ కాలనీ గుడిసె వాసులకు చెందిన 30 ఇండ్లను రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఫిబ్రవరి 22న అర్ధరాత్రి తొలగించటం అన్యాయం అన్నారు. ఈ ఇండ్ల తొలగింపు అత్యంత అమానుషంగా, మానవ విలువలకు తిలోదకాలిస్తూ జరిపారని విమర్శించారు. బలవంతంగా ఇంటిలోని సామాన్లు బయటపడేసి కూల్చివేశారని, రోడ్డున పడిన ఈ కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిమ్స్ ఆస్పత్రికి స్థలం కావాలంటే ప్రజలకు నచ్చజెప్పాలి కానీ బలవంతంగా లాక్కోవడం సరికాదన్నారు. గుడిసె వాసులకు న్యాయం జరిగే వరకు వారికి ఎర్రజెండా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కూల్చివేసిన గుడిసె వాసుల ఇండ్ల స్థలాలను ప్రభుత్వం జీవో నెం 58 కింద క్రమబద్ధీకరిస్తూ.. 2015లో సర్టిఫికెట్ ఇచ్చిందని, అయినా కూల్చివేయటం అన్యాయం అన్నారు. ఖైరతాబాద్ జోన్ కన్వీనర్ జి.కిరణ్ మాట్లాడుతూ.. ఇండ్లను కూల్చే ముందు చట్ట ప్రకారం నోటీసు ఇవ్వలేదన్నారు. ఇంట్లోని సామాన్లు తీసుకునే సమయమూ ఇవ్వకుండా పోలీసులతో ఇండ్లను దిగ్బంధం చేసి.. బలవంతంగా సామాన్లు బయటపడేసి అమానుషంగా రెవెన్యూ అధి కారులు వ్యవహరించారన్నారు.
వీరికి ప్రత్యామ్నాయంగా వెంటనే ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) నగర నాయకులు శ్రీరాములు, ఖైరతాబాద్ ఐద్వా జోన్ కార్యదర్శి రాధిక, బస్తీవాసులు సూర్య కుమారి, రాజ్ కుమార్, మల్లేశ్వరి, అక్తర్ సుల్తాన్, మాబునీ, జాకీర్, నరేష్, శివ, గుడిసెవాసులు, కుటుంబ సభ్యులు మహిళలు పిల్లలు సహా పాల్గొన్నారు.