Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో పాపన్నగారి మాణిక్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరారు. బుధవారం ఓయూలో ఆర్ట్స్ కళాశాల, సైన్స్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కాలేజీ, టెక్నాలజీ కాలేజీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రొఫెసర్స్‌ను ఓటు వేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం భవిష్యత్‌లో నిక్కచ్చిగా కొట్లాడే వ్యక్తిగా మాణిక్‌రెడ్డి ఉంటారని తెలిపారు. ఇప్పటికే తాను పలుమార్లు శాసనమండలిలో విశ్వవిద్యాలయలలోని అధ్యాపకుల సమస్యలు, కాంట్రాక్ట్ టీచర్ల సమస్యలు, యూనివర్సిటీలో నెలకొన్న మౌలిక వసతుల గురించి ప్రస్తావించినట్టు తెలిపారు. భవిష్యత్తులో మాణిక్ రెడ్డి కూడా తనతో కలిసి ఉద్యమిస్తారన్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్లు వివిధ సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆమంచి నాగేశ్వర్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కాంట్రాక్టు టీచర్స్ యూనియన్ రామేశ్వరరావు, టెక్నాలజీ కాలేజ్ భాస్కర్, యూటీఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్, రాములు, సాంబన్న పాల్గొన్నారు.