Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలనీ, అడ్డగోలుగా పెంచడం మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన భారత రాష్ట్ర సమితి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని విమర్శించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం భారీగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహ అవసరాల సిలిండర్ ధరను 50 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ ధరను 350 రూపాయల మేర భారీగా పెంచిందని విమర్శించారు. ఆయా రాష్ట్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే ఇంత భారీగా సిలిండర్ ధరను పెంచడం దారుణమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన కానుకనా ఈ సిలిండర్ ధరల పెంపు అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ నెల 3న అన్ని నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సిలిండర్ ధరల పెంపు పైన నిరసన కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎక్కడి వారక్కడ వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవం రోజున సైతం గ్యాస్ ధరల పెంపుపైన కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. మోడీ ప్రభుత్వం రాకముందు 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఈరోజు 1160ని దాటి 1200లకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఉజ్వల స్కీం పేరుతో మాయమాటలు చెప్పిన బీజేపీ ప్రభుత్వం ధరలను పెంచుతూ వారిని సిలిండర్‌కు దూరం చేస్తున్నదన్నారు.