Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేధింపులు భరించలేక కార్పొరేట్ కాలేజీ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
- కారకులెవరన్నది సూసైడ్ నోట్లో వెల్లడి
- కాలేజీ ఎదుట మృతుని బంధువులు, ప్రజాసంఘాల ఆందోళన
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు ముట్టడి
నవతెలంగాణ-గండిపేట్/ సుల్తాన్ బజార్
ఓ కార్పొరేట్ కాలేజీ యజమాన్యం వేధింపులు భరించలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారకులెవరన్న దానిపై సూసైడ్ నోట్ రాసి పెట్టుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన సాత్విక్(16) నార్సింగ్‌లోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్ విద్యార్థులపై విపరీతంగా ఒత్తిడి ఉంటోంది. కొన్ని రోజుల నుంచి కాలేజీ యజమాన్యం చదువు పేరుతో వేధింపులు, ఒత్తిడికి గురిచేయ డంతో సాత్విక్ తట్టుకోలేకపోయాడు. మంగళవారం రాత్రి పది గంటల సమయంలో తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి తెలియజేసినా పట్టించుకోలేదు. దీంతో కొన ఊపిరితో ఉన్న సాత్విక్‌ను తోటి విద్యార్థులు ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బంధువులు, విద్యార్థులు కాలేజీ ఎదుట బైటాయించారు. తమ కుమారుడు ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణమని రహదారిపై బైటాయించారు. తల్లిదండ్రులకు మద్దతుగా ప్రజాసంఘాల నాయకులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థి స్వాతిక్ మృతికి కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన సమయంలో వార్డెన్, ప్రిన్సిపల్, లెక్చరర్స్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తోటి విద్యార్థులు రూం తాళం పగలగొట్టి సాత్విక్‌ను భుజాలపైన వేసుకుని వెళ్తున్నా కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాదాపూర్ ఏసీపీ, సీఐలు, ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకుని అందోళనకారులను చెదరగొట్టారు. కుటుంబా నికి న్యాయం చేసే విధంగా యాజమాన్యంతో మాట్లాడతామని, కేసు పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని వారికి హామీ ఇచ్చారు. కాగా, విద్యార్థి సాత్విక్ జేబులో పోలీసులు సూసైడ్ నోట్‌ను గుర్తించారు. ''అమ్మా, నాన్న.. నన్ను క్షమిం చండి.. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ప్రిన్సిపల్, ఇన్చార్జి, లెక్చరర్లు పెట్టే టార్చర్ వల్ల ఆత్మ హత్య చేసుకుం టున్నాను. కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేశ్ వేధింపులు తట్టుకోలేక పోయాను. ఈ ముగ్గురు హాస్టల్లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. వీరి వేధిం పులు తట్టుకోలేకనే నేనే ఆత్మహత్య చేసుకోవా లని నిర్ణయించుకున్నాను. నన్ను వేధించిన ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోండి. అమ్మా, నాన్న లవ్ యూ, మిస్ యూ ఫ్రెండ్స్'' అని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు ముట్టడి
ర్యాంకులు, మార్కుల కోసం విద్యార్ధులపై తీవ్ర ఒత్తిడి పెంచి, కులం పేరుతో తిట్టి ఆత్మహత్య చేసుకునే విధంగా వ్యవహరించిన నార్సింగి శ్రీచైతన్య కళాశాల యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యకు డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఇంటర్ బోర్డు కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా టి.నాగరాజు మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్యాసంస్థల్లో పరీక్షల సమయం దగ్గరకు రాగానే ర్యాంకుల కోసం విద్యార్థులను తీవ్రంగా వేధింపులు గురి చేస్తున్నాయని తెలిపారు.
శ్రీచైతన్య విద్యాసంస్థలోనే గత నెలలో ఫిర్జాదీగూడలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కమిటీలు వేశామని కాలయాపన చేస్తుంది తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. విద్యార్థి సాత్విక్‌ను ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి కులం పేరుతో దూషించి, దాడి చేసి బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. వైస్ ప్రిన్సిపల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు పర్యవేక్షణా లోపం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేట్ కళాశాలలు ఫీజులు దోపిడీ చేస్తూ విద్యార్థులను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాయని చెప్పారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా, ఉపాధ్యక్షులు శ్రీమాన్, నాగేందర్, సునీల్, నాయకులు శివ, వాసు, శ్రీరామ్, సాయి కిరణ్, నిఖిల్, వెంకట్, లిఖిత్ పాల్గొన్నారు.