Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఆర్ శిక్షణా కార్యక్రమం ప్రారంభించిన మంత్రి హరీశ్
- సీపీఆర్ తెలిసిన వారు పక్కన లేకనే కేటీఆర్ మామ మరణం
- అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా శిక్షణనివ్వాలని నిర్ణయం : మంత్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆకస్మికంగా వచ్చే కార్డియాక్ అరెస్ట్‌తో రాష్ట్రంలో ఏడాదికి 24 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం మేడ్చల్‌లోని జీవీకే, ఈఎంఆర్‌ఐలో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ తన సహచర మంత్రి కేటీఆర్ మామ దగ్గరలో సీపీఆర్ తెలిసిన వారు లేకపోవడంతోనే ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా సీపీఆర్ అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచనను కేటీఆర్ ముందుకు తెచ్చారనీ, దానిపై చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్డియాక్ అరెస్ట్ అనేది సమయం, సందర్భం, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరికైనా వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. అయితే సకాలంలో కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేయడం వల్ల వీరి ప్రాణాలు కాపాడటం సాధ్యమవుతుందని సూచించారు. సడెన్ కార్డియాక్ అరెస్టులు (ఎస్.సి.ఎ), హార్ట్ స్ట్రోక్‌లు పెరుగుతున్నాయనీ, కండ్ల ముందే ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తుచేశారు. అయితే సకాలంలో కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేయడం వల్ల చనిపోయే వారి సంఖ్యను తగ్గించే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. ప్రస్తుతం కార్డియాక్ అరెస్ట్ అయిన ప్రతి పది మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారనీ, సీపీఆర్ సకాలంలో చేస్తే కనీసం ఐదుగురిని బతికించుకునే అవకాశం ఉంటుందని ప్రపంచ అరోగ్య సంస్థ, ఇతర సంస్థలు చెబుతున్నాయని ఉదహరించారు. 'జిమ్ చేస్తూ, పనులు చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, నడుస్తూ కొంత మంది సడెన్‌గా పడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి వీడియోలు సోషల్ మీడియా, టీవీల్లో చూస్తున్నాం. ఇవి సడెన్ కార్డియాక్ అరెస్ట్ కేసులే. సీపీఆర్ తెలిసిన వారు ఉంటే సీపీఆర్ చేసి వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ప్రాణాపాయంలో ఉన్న వారికి సీపీఆర్ చేసేందుకు చదువు అవసరం లేదు, మెడికల్ పరిజ్ఞానం అవసరం లేదు, వయస్సుతో సంబంధం లేదు. ఎవ్వరైనా సరే సీపీఆర్ చేసి ప్రాణాన్ని కాపాడవచ్చు. కొంత అవగాహన, కొంత సమయ స్ఫూర్తి ఉంటేచాలు. అందుకోసమే ఈ కార్యక్రమం.రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ విస్తారించలన్నదే ప్రభుత్వం ప్రయత్నం. వైద్యారోగ్య, పోలీసు, మున్సిపల్, పంచాయత్‌రాజ్ అందరికీ శిక్షణ ఇస్తున్నాం. గేటేడ్ కమ్యూనిటీ, సెక్యూరిటీ, వాచ్మెన్, అసోసియేషన్, బస్తీల్లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, పంచాయతీల్లో, మున్సిపాల్టీల్లో అందరికీ శిక్షణనిస్తాం.గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజా ప్రతినిధులు, పోలీసు సిబ్బందికీ శిక్షణ ఇస్తాం...' అని మంత్రి తెలిపారు. 'మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, చెడు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి తదితర కారణాలు గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. కరోనా తర్వాత కార్డియాక్ అరెస్టులు పెరిగాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అనుకోని ప్రమాదాలు, దుర్ఘటనలు జరిగినప్పుడు మనిషి సైక్లాజికల్ షాక్స్‌కి గురవుతాడు. ఈ సమయంలో హదయ స్పందనలో తేడా వస్తుంది. గుండె లయ తప్పి ఆగిపోతుంది. అలాంటి సమయంలో మనిషి స్పందించడు. శ్వాస ఆగిపోతుంది. ఆ సమయంలో గుండె కొట్టుకునేలా ఛాతి మీద పదే పదే ఒత్తిడి చేయడం, నోటి ద్వారా కృత్రిమ శ్వాసను అందించడం వల్ల గుండె , ఊపిరితిత్తులు తిరిగి పని చేస్తాయి. దీన్నే సీపీఆర్ అంటారు. దీన్ని తెలుగులో హృదయ శ్వాస పునరుద్ధరణ అంటారు. ఇంత చేసినా కొన్ని సార్లు గుండె స్పందించదు. అలాంటి సందర్భంలో ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డెఫిబ్రిలేటర్స్- ఏఈడీ అనే వైద్య పరికరం ద్వారా ఛాతి నుంచి గుండెకు స్వల్ప మోతాదులో ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా గుండె తిరిగి పని చేసేలా చేయడం సాధ్యమవుతుంది. మొదటి దశలో రూ.18 కోట్లతో 1,200 ఏఈడీ మిషన్లు కొంటాము. అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానల్లో నెల రోజుల్లో అందుబాటులోకి తెస్తాం...' అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో కనీసం లక్ష మందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. సీపీఆర్ విషయంలో తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీపీఆర్ శిక్షణా కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.