Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు, ప్రజాసంఘాల నిరసన
- నిరసనలో పాల్గొన్న బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు
- మోడీ దిష్టిబొమ్మల దహనం
- తగ్గించాలి : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లులక్ష్మి
నవతెలంగాణ- విలేకరులు
గ్యాస్ ధరల మంటపై ప్రధాని మోడీ దిష్టిబొమ్మలు దహనమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు, ప్రజాసంఘాలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని కేంద్రంపై నిప్పులు చెరిగారు.
పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. సూర్యాపేటలోని వాణిజ్య భవన్ సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎనిమిదేండ్ల కిందట రూ.400 ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధరను రోజురోజుకూ పెంచడం మూలంగా పేద, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు వంట గ్యాస్ ధర రూ.1176.50కు పెరిగిందన్నారు. అంతకు ముందు సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయం నుంచి వాణిజ్య భవన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నకిరేకల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండరు ధరలు తగ్గించాలని చిట్యాలటౌన్లో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట సరోజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల పట్టణ కేంద్రంలోని శివాజీ నగర్ కాలనీలో ఐద్వా ఆధ్వర్యంలో కట్టెల పొయ్యి, సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆమనగల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. రాజేంద్రనగర్ పరిధిలోని దుర్గానగర్ చౌరస్తాలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. చేవెళ్ల పరిధిలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
హనుమకొండ జిల్లాలోని అదాలత్ సెంటర్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాజీపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. దామెర మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. జనగామ పట్టణంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి రాస్తారోకో చేపట్టారు.
జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జనగామ జెడ్పీ చైర్మైన్ పాగాల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు. బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. రోడ్డుపైనే వంటావార్పు చేసి నిరసన తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నెహ్రూ సెంటర్లో ధర్నా నిర్వహించారు.
ఖమ్మం నగరంలోని సరిత క్లినిక్ సెంటర్ వద్ద కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా సెంటర్‌కు వచ్చారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇప్పటికే నిత్యావసరాల ధరలన్నీ మండిపోతుంటే మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచటం ఏంటని ప్రశ్నించారు. ఖమ్మం బైపాస్ రోడ్డులో సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఖమ్మం రూరల్ మండలం నాయుడు పేట, వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కూసుమంచిలో ఖమ్మం- సూర్యాపేట ప్రధాన రహదారిపై మోడీ దిష్టి బొమ్మ దహనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో గ్యాస్ బండతో నిరసన తెలిపారు.
హైదరాబాద్ మీర్పేట్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లెలగూడ సండే చెరువు కట్ట నుంచి మీర్పేట్ చౌరస్తా వరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి నెత్తిపై కట్టెల మోపు పెట్టుకొని నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పొరపాటున కమలం గుర్తుకు ఓటు వేస్తే కట్టెల పొయ్యి వస్తది.. మళ్లీ మునుపటి రోజులు వస్తాయన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్లో గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పెద్దఎత్తున ధర్నా నిర్వహించా రు. అనంతరం కట్టెల పొయ్యిపై మంత్రి వంట చేశారు. ఎల్బీనగర్ చౌరస్తాలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కుత్బుల్లాపూ ర్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆధ్వర్యంలో స్థానిక మహిళలు సిలిండర్లపై పూలు చల్లి నిరసన తెలిపారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడా బస్తీ చౌరస్తాలో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు.
సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం నుంచి 'వై' జంక్షన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంచడంతో పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుగుతున్నదని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలను దోపిడీ చేసి తన కార్పొరేట్ మిత్రులకు దోచిపెడుతున్న ప్రధాని మోడీ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈసీఎల్ కమలానగర్ చౌరస్తాలో ఐద్వా మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కట్టెల పొయ్యితో నిరసన తెలిపారు. ఆవాజ్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో మెహిదిపట్నం చౌరస్తాలో నిరసన తెలిపారు.
నిర్మల్ జిల్లా మధోల్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో నయాబాది చౌరస్తాలో ధర్నా చేపట్టారు. కడెం మండల కేంద్రంలో ఎమ్మెల్యే రేఖానాయక్ రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. కొనరావుపేట మండల కేంద్రంలో ఐద్వా ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో మహిళలు నిరసన తెలిపారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఐఎఫ్టీయు నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
కరీంనగర్‌లోని గీతా భవన్ చౌరస్తాలో సీపీఐ(ఎం), కమాన్ చౌరస్తాలో సీపీఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఖాళీ సిలిండర్లు నెత్తిన ఎత్తుకొని, కట్టెల మోపు ఎత్తుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్న మోడీ నిరంకుశ పాలన నశించాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మానకొండూర్, గన్నేరువరం, శంకరపట్నం, హుజూరాబాద్, మేడిపల్లి మండలాల్లో కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంతోపాటు గోదావరిఖనిలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేశారు. పెద్దపల్లిలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు విజయరమణావు ఆధ్వర్యంలో రోడ్డుపై ఖాళీ సిలిండర్లతో ఆందోళన చేశారు.
దేశానికి మోడీ ప్రధాని కావడం దురదృష్టమని, మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి కావడంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి పేద, మధ్య తరగతి ప్రజలపై భారాన్ని మోపిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రధాని మోడీ మిత్రుడు అదానీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకే ఈ ధరల పెంపు అని ఆరోపించారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో మంత్రి గ్యాస్ సిలిండర్ ఎత్తుకుని నిరసన వ్యక్తం చేశారు.