Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'గండ్రల' సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత
- 144 సెక్షన్ అమలు.. భారీగా మోహరించిన పోలీసులు
- హనుమకొండలో గండ్ర సత్యనారాయణ హౌస్ అరెస్ట్
- భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సైతం హౌస్ అరెస్ట్
నవ తెలంగాణ-భూపాలపల్లి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ సవాళ్లు.. ప్రతిసవాళ్లతో జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో గురువారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో పోలీసులు 144 సెక్షన్ విధించి.. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌తోపాటు ఆయా మండలాల్లో భారీగా మోహరించారు. ఉదయమే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారా యణరావును, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గండ్ర జ్యోతిని హౌస్ అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే, జిల్లా కేంద్రంతోపాటు భూపాలపల్లి నియోజకవర్గంలోని ఆయా మండలాల అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు.
గత బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యానారాయణ పోటాపోటీగా సవాళ్లు విసురుకున్న విషయం తెలిసిందే. తాను ఎలాంటి అక్రమాలు, భూ ఆక్రమణలకూ పాల్పడలేదని, కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే అక్రమాలు, కబ్జాలపై ఆధారాలతో సిద్ధంగా ఉన్నా.. నిరూపిం చేందుకు గురువారం భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో చర్చకు రావాలంటూ గండ్ర సత్యనారాయణ ప్రతి సవాల్ విసిరారు. దీంతో భూపాలపల్లి రాజకీయాల్లో ఉద్రిక్తంగా మారింది. వరుసగా మూడు రోజులుగా భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను, కటౌట్లను కట్టనీయకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదేరోజు సాయంత్రం పబ్లిక్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ నేతలపై, రేవంత్ రెడ్డి కాన్వారు పై రాళ్లు, కోడిగుడ్లతో దాడి జరిగింది. ఇదంతా గండ్ర రమణారెడ్డి అనుచరులే చేస్తున్నారని, ఎమ్మెల్యే పథకం ప్రకారం వరుస దాడులకు ఉసిగొల్పు తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గండ్ర, కాంగ్రెస్ నేత సత్యనారాయణ సవాళ్లు విసురుకోవడం, గురువారం భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో వేదికగా నిర్ణయించుకోవడంతో పోలీసు శాఖ అప్రమత్త మైంది. గురువారం నుంచి వారం రోజులపాటు జిల్లా కేంద్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ సురేందర్ రెడ్డి తెలిపారు.
గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్యే గండ్ర హౌస్ అరెస్ట్
అంబేద్కర్ సెంటర్ వేదికగా బహిరంగ చర్చకు రానున్న నేపథ్యంలో హన్మకొండలో నివాస ముంటున్న కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణను తెల్లవారుజామునే హౌస్ అరెస్టు చేసి భారీగా పోలీసులు మోహరించారు. అలాగే, బహిరంగ చర్చకు వచ్చేందుకు సిద్ధపడుతున్న తరుణంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు గండ్ర జ్యోతిని భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హౌస్ అరెస్టు చేశారు.
భారీ బందోబస్తు
జిల్లా కేంద్రంలో ఎస్పీ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చేపట్టారు. ఉదయం నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంబేద్కర్ చౌరస్తాలో భారీగా పోలీసులు మోహరించారు.
పోటాపోటీగా దిష్టిబొమ్మల దహనం
144 సెక్షన్ అమల్లో ఉన్నా జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఇది తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.