Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుబాబుల్ రైతుల సమస్యలపై చర్చ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో సుబాబుల్ పండించే రైతుల సమస్యలను పరిష్కరించేందుకు రైతు బంధు పథకం రాష్ట్ర చైర్మెన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి చొరవ తీసుకున్నారు. గురువారం హైదరాబాద్లో తెలంగాణ రైతు బంధు సమితి కార్యాలయంలో ఐటీసీ అధికారులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఉన్నారు. ఐటీసీ భద్రాచలం సుబాబుల్ రైతులకు సరైన మద్దతు ధర ఇవ్వడం లేదని రైతుల ఆవేదనను ఐటీసీ అధికారి టి.ఉషారాణి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. 2014 నుంచి 2023 వరకు కంపెనీ రైతులకు అందిస్తున్న మద్దతు ధర క్రమేపీ తగ్గడం, లేబర్, రవాణా ఇతర ఖర్చులు పెరగడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. మధ్యదళారుల బెడద కూడా రైతులను ఇబ్బందిపాలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో ఐటీసీ కంపెనీ తగు చర్యలు తీసుకుని మధ్య దళారుల బెడదను తగ్గించి కంపెనీ ప్రకటించిన మద్దతు ధర పూర్తిగా రైతులకు చేరేటట్టుగా చూడాలని కోరారు. దీనిపై 15 రోజుల్లో పూర్తిగా దర్యాప్తు చేసి, జరుగుతున్న లోపాలను సరిదిద్దుతామని ఐటీసీ అధికారులు తెలిపారు. స్థానిక ప్రతినిధులతో ఐటీసీ కంపెనీ అధికారులు సమావేశమై చుట్టుపక్కల గ్రామాల్లో తీసుకోవలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించి వారి పరిశ్రమ సీయస్ఆర్ నిధులను సరిగా వినియోగించాలని అధికారులకు వివరించారు.