Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కనీస వసతులు లేకపోవడంపై హైకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది. ఏడువందల మంది విద్యార్థులకు ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉందని పత్రికలో వచ్చిన వార్తలపై ఆ్యశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. వసతుల కల్పనకు ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. సరూర్‌నగర్ కాలేజీలో వసతులు లేకపోవడంపై పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎల్ఎల్బీ విద్యార్థి నల్లపు మణిదీప్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్‌భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేసింది.
ఆక్రమణలపై చర్యలను నివేదించండి : హైకోర్టు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆలయ భూముల ఆక్రమణలపై పత్రికల్లో వచ్చిన వార్తను హైకోర్టు పిల్‌గా స్వీకరించి విచారణ చేపట్టింది. ఆక్రమణల నివారణకు, ఆలయ భూముల రక్షణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 13కు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్‌భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది. విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని ప్రకటించింది.
బడి స్థలంలో ఇతర నిర్మాణాలపై స్టేటస్కో
మధురానగర్‌లోని పాఠశాల కూల్చివేసి కమ్యూనిటీ హాలు నిర్మాణం చేయడాన్ని నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర వివరాలు నివేదిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని అధికారులకు నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్ 15కు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్‌భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశించింది. పాఠశాల భవన స్థలంలో మరో నిర్మాణం చేయడాన్ని తప్పుపడుతూ అదే ప్రాంతానికి చెందిన రాములు రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టింది. అధికారులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.