Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీ రోడ్ల పనుల బిల్లుల చెల్లింపుకు రూ.65వేలు డిమాండ్
- అధికారులను ఆశ్రయించిన కాంట్రాక్టర్ కొమురయ్య
నవతెలంగాణ - స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని శివునిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి కుర్ర చిరంజీవి ఏసీబీ వలకు చిక్కారు. కాంట్రాక్టర్ శివరాత్రి కొమురయ్య నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ కె.సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామంలో 2022 ఏ1 కాంట్రాక్ట్ 11 పనులకుగానూ గ్రామ పంచాయతీ నిధులు రూ.21లక్షలు ఇచ్చారు. ఈ క్రమంలో సీసీ రోడ్లు నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టారు. పని పూర్తయినందున బిల్లులు చెల్లించాలని గ్రామకార్యదర్శి చిరంజీవికి ఎంబుక్లు, పనుల రికార్డులను అప్పగించారు. ఆ పనికి సంబంధించి రూ.65వేలు లంచం డిమాండ్ చేయగా.. మొదటి విడతగా రూ.15వేలు ఇచ్చారు. మిగిలిన రూ.50 వేలు ఇవ్వలేనని కాంట్రాక్టర్ వేడుకొన్నప్పటికీ, లంచం ఇస్తేనే బిల్లు చెల్లిస్తామని కార్యదర్శి తెగేసి చెప్పారు. దాంతో కొమురయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొమురయ్య రూ.50 వేలు కార్యదర్శికి ఇవ్వగానే, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ దాడిలో ఇన్స్పెక్టర్లు రవి, శ్యాంకుమార్, శ్రీను పాల్గొన్నారు.