Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరలకనుగుణంగా పెంచాలి
- కాస్మోటిక్ చార్జీలు నెలకు రూ.వెయ్యి ఇవ్వాలి
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పోరాటాల ఫలితంగానే సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ తెలిపింది. కానీ పెంచిన చార్జీలు నామమాత్రమేననీ, పెరిగిన ధరలకనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేసింది. మరి కాస్మోటిక్ చార్జీల సంగతేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాస్మోటిక్ చార్జీలు నెలకు రూ.వెయ్యి వరకు పెంచాలని కోరింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇల్లు అలకగానే పండుగ కాదనీ, మెస్ చార్జీలు పెంచగానే హాస్టళ్ల సమస్యలు పోవని తెలిపారు. కేవలం మెస్ చార్జీలే నామమాత్రంగా పెంచారు తప్ప, కాస్మోటిక్ చార్జీలను పెంచలేదని పేర్కొన్నారు. సమస్యలన్నింటికీ మూలం మెస్ చార్జీలు కాదనీ, మౌలిక వసతులు మెరుగుపర్చకుంటే వాటిని ఏర్పాటు చేసిన లక్ష్యం నేరవేరదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల విద్యాభివృద్ధికి పట్టుకొమ్మలుగా ఉన్న హాస్టళ్ల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక నిధులివ్వాలని డిమాండ్ చేశారు. నిధులు అడిగితే ఈ హాస్టళ్లను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. హాస్టళ్ల రక్షణ కోసం ప్రతినబూని మెస్ చార్జీలు పెంచాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాలో 23,571 కిలోమీటర్లపాటు సైకిల్ యాత్రలు, బైక్ యాత్రలు చేశామని గుర్తు చేశారు. హాస్టళ్లను సందర్శించి సమస్యలు వెలుగులోకి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం దశల వారీగా ఆందోళన చేశామని తెలిపారు. ఏటా శ్వాశత వార్షిక సమీక్ష కమిటీ ఏర్పాటు చేసి పెరుగుతున్న నిత్యావసర ధరలకనుగుణంగా హాస్టళ్ల నిర్వహణకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఐదేండ్ల తర్వాత ఇప్పుడు మెస్చార్జీలను 25 శాతం పెంచి భారీగా పెంచామంటున్నారని పేర్కొన్నారు. గత ఐదేండ్ల నుంచి నిత్యావసరాల ధరలు 25 శాతం మాత్రమే పెరిగాయా?, కేవలం మెస్ చార్జీలు పెంచడంతో ప్రభుత్వ బాధ్యత తీరిపోతుందా?అని ప్రశ్నించారు. హాస్టళ్లలో వసతులు, మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచడానికి ఇప్పటికీ ఒక యంత్రాంగం లేదని విమర్శించారు. అసెంబ్లీలో, పార్లమెంట్లో గౌరవ సభ్యుల జీతాలు పెంచడానికి స్థాయి సంఘాలు, ఉద్యోగుల వేతనాలకు పీఆర్సీ కమిటీలున్నాయని గుర్తు చేశారు. కానీ విద్యార్థుల అవసరాలు తీర్చేందుకు ఎలాంటి యంత్రాగం లేదని తెలిపారు. జీవో నెంబర్ 126 ప్రకారం వారికి ఇవ్వాల్సిన అన్ని సౌకర్యాలూ కల్పించాలని కోరారు. లేకుంటే భవిష్యత్ పోరాటాలను మళ్లీ ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గురుకులాలు, కేజీబీవీ, సంక్షేమ హాస్టళ్లను సందర్శించి సమస్యలపై పోరాటాలకు రూపకల్పన చేస్తామని తెలిపారు.