Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్
- నార్సింగి శ్రీ చైతన్య కాలేజీ ఎదుట నిరసన దీక్ష
నవతెలంగాణ-గండిపేట్
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీ చైతన్య కాలేజీపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజ్ ఎదుట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి సాత్విక్ మరణానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో చైతన్య, నారాయణ కాలేజీల వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రయివేట్ కాలేజీల ఆగడాలపై చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని అన్నారు. ఏడు వేల స్కూల్స్ మూతపడినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లను కాపాడకుండా శ్రీ చైతన్య, నారాయణ కాలేజ్లను ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలో స్కూల్స్, కాలేజీలను ప్రయివేటుకు అప్పజెప్పేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. ర్యాంకుల కోసం శ్రీ చైతన్య కాలేజీ వ్యాపారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యానికి అమ్ముడుపోయినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ ఉన్నదా లేదా అనుమానం కల్గుతుందన్నారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. విద్యార్థులు ప్రయివేట్ కాలేజీల్లో కాకుండా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకోవాలన్నారు.