Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీ అంజనీ కుమార్
- 'రోడ్ యాక్సిడెంట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్' పుస్తకాన్ని ఆవిష్కరించిన డీజీపీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడంలో పోలీసులతో పాటు ప్రతి పౌరుడూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. గురువారం డీజీపీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో రిటైర్డ్ పోలీసు అధికారి తిరుపతిరెడ్డి రచించిన రోడ్ యాక్సిడెంట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ అనే పుస్తకాన్ని డీజీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఎదురవతున్నాయని, ఇందులో మానవ తప్పిదాల కారణంగానే ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో జరిగే రోడ్డు ప్రమాదాల సంఖ్య తక్కువేనని అన్నారు. ఈ కారణం చేతనే నగరంతో పాటు ఇతర పట్టణాలు రోడ్డు ప్రమాదాల పరంగా సురక్షితంగా ఉన్నాయని ఆయన చెప్తూ పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి కూడా ఇదీ ఒక కారణమని ఆయన తెలిపారు. నేషనల్ పోలీసు అకాడమి మాజీ డైరెక్టర్ కమల్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు వాటి నుంచి ఇన్సూరెన్సులను క్లెయిమ్ చేసుకోవడంలో బాధితులు చూపుతున్న శ్రద్ధ యాక్సిడెంటుకు కారణమైన వ్యక్తులకు కోర్టులలో శిక్షలు పడేలా చేయడంలో చూపించడం లేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం కేవలం పోలీసుల పనేనని, వారి పైనే నెపాన్ని మోపడం న్యాయం కాదని అన్నారు. వాహనంతో రోడ్డుపైకి వచ్చిన ప్రతి వ్యక్తి తమ వంతు బాధ్యతతో ట్రాఫిక్ నిబంధనలను పాటించినపుడు ఈ ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. ప్రతి ఏటా 4.50 లక్షల యాక్సిడెంట్లు మన దేశవ్యాప్తంగా జరుగుతుండగా అందులో లక్ష మందికి పైగా ప్రాణాలను వదులుతున్నారని చెప్పారు. దొంగతనాలు, దోపిడీలు తదితరమైన నేరాలకు కొందరు మాత్రమే బాధ్యులైతే రోడ్డు ప్రమాదాలకు సమాజంలో ప్రతి ఒక్కరమూ బాధితలమవుతున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు సంజరు కుమార్ జైన్, శివధర్‌రెడ్డి, అభిలాష బిస్త్, కె. శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.