Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ సంతోష్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అడవులను రక్షించాలంటే పెద్దపులులను సంరక్షించాల్సిందేనని రాజ్యసభ సభ్యులు, అడవులు, పర్యావరణంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు జోగినపల్లి సంతోశ్ కుమార్ తెలిపారు. ఇందుకోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున పులుల రక్షణకు మద్దతిస్తున్నట్టు చెప్పారు. ప్రాజెక్ట్ టైగర్కు యాభై ఏండ్లు పూర్తయిన సందర్బంగా ఆయన ట్వీట్ చేశారు. 1973లో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించే నాటికి 1,827గా నమోదైన పులుల సంఖ్య 2022 నాటికి 2,967కు పెరిగిందని పేర్కొన్నారు. సేవ్ టైగర్ ఉద్యమం గోల్డెన్ జూబ్లీ సందర్భంగా రాష్ట్రానికి చెందిన అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ అధికారులు విడుదల చేసిన టైగర్ బుక్, టీ షర్ట్, కాఫీ మగ్ సావనీర్లను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ ద్వారా అమ్రాబాద్, కవాల్ పులుల అభయారణ్యంలను చాలా బాగా నిర్వహిస్తోందనీ, పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని ఈ సందర్భంగా సంతోశ్ కుమార్ చెప్పారు. పర్యావరణ సమతుల్యతలో పెద్దపులి అగ్రభాగాన ఉంటుందని పేర్కొన్నారు. కొత్త తరాలకు ఈ అమోఘమైన జంతువును చూసి, కాపాడాల్సిన బాధ్యత అందించాలని ఆయన పిలుపునిచ్చారు.