Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్ 20 నుంచి అర్ధసంవత్సర పరీక్షలు
- 2024, మార్చి మొదటివారంలోవార్షిక పరీక్షలు
- జూనియర్ కాలేజీల పనిదినాలు 227
- ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
- వచ్చే విద్యాసంవత్సరం అకడమిక్ క్యాలెండర్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో జూన్ ఒకటి నుంచి జూనియర్ కాలేజీలకు కొత్త విద్యాసంవత్సరం (2023-24) ప్రారంభం కానుంది. అయితే ఇంటర్ ద్వితీయ సంవత్సరంతోపాటు మొదటి సంవత్సరం విద్యార్థులకూ అదే రోజు తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన జూనియర్ కాలేజీల అకడమిక్ క్యాలెండర్ను ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ శనివారం విడుదల చేశారు. మొత్తం 304 రోజులకుగాను ఆదివారాలు, పండుగలు, ఇతర సెలవులు 77 ఉన్నాయని తెలిపారు. వచ్చేవిద్యాసంవత్సరంలో జూనియర్ కాలేజీలకు 227 పనిదినాలుంటాయని స్పష్టం చేశారు. 48వ బోర్డు సమావేశం ప్రకారం వాటికి 220 పనిదినాలుండాలని వివరించారు. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 25వ తేదీ వరకు అర్థసంవత్సర పరీక్షలుంటాయని తెలిపారు. 2024, మార్చి మొదటివారంలో ఇంటర్ వార్షికలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి రెండు వారంలో ప్రాక్టికల్ పరీక్షలుంటాయని తెలిపారు. వచ్చేఏడాది జనవరి 22 నుంచి 29వ తేదీ వరకు ప్రీఫైనల్ పరీక్షలను నిర్వహిస్తామని వివరించారు. జూనియర్ కాలేజీలకు చివరి పనిదినం మార్చి 31 అని పేర్కొన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులుంటాయని తెలిపారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే చివరి వారంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. 2024-25 విద్యాసంవత్సరంలో జూనియర్ కాలేజీలు వచ్చే ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతాయని వివరించారు. అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, 2023, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులుంటాయని తెలిపారు.
షెడ్యూల్ ప్రకారమే ప్రవేశాలు కల్పించాలి
రాష్ట్రంలోని ప్రయివేటు జూనియర్ కాలేజీలన్నీ ఈనెల ఒకటి నుంచి మే 31వ తేదీ వరకు బంద్ చేయాలని నవీన్ మిట్టల్ ఆదేశించారు. వేసవి సెలవులు, ఆదివారాలు, పండుగలకు ప్రభుత్వం ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా కాలేజీలు సెలవు ప్రకటించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు కల్పించిన కాలేజీలపై చర్యలు తీసుకుంటామేని హెచ్చరించారు.
అకడమిక్ క్యాలెండర్లో ముఖ్యాంశాలు
- జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభం
- ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం
- నవంబర్ 20 నుంచి 25 వరకు అర్థసంవత్సరం పరీక్షలు
- జనవరి 22 నుంచి 29 వరకు ప్రీఫైనల్ ఎగ్జామ్స్
- ఫిబ్రవరి రెండోవారంలో ప్రాక్టికల్స్
- మార్చి మొదటివారంలో వార్షిక పరీక్షలు
- ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు