Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగంలో క్యూఆర్టీ బృందాలు1500 సిబ్బందితో పటిష్టమైన నిఘా
- ప్రేక్షకులకు, సాధారణ వాహనదారులకు ఇబ్బందుల్లేకుండా పార్కింగ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్-2023 క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని హెచ్‌సీఏ, ఐపీఎల్ ప్రతినిధుల సమన్వయంతో అన్ని చర్యలూ చేపట్టామన్నారు. శనివారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో విలేకరుల సమావేశంలో జాయింట్ సీపీ ఏ.సత్యనారాయణతో కలిసి సీపీ వివరాలు వెల్లడించారు.
ఈ నెల 2 నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు ఉప్పల్ స్టేడియంలో 7 మ్యాచ్‌లు జరగనున్నాయన్నారు. స్టేడియంలో 38 వేల సిటింగ్ కెపాసిటీ ఉందన్నారు. ప్రతి మ్యాచ్‌కూ 1500 మందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా క్విక్ రెస్పాన్స్ బృందాలను(క్యూఆర్టీ) రంగంలోకి దించుతున్నామని తెలిపారు. వీటితోపాటు సెక్యురిటీ వింగ్, ఎస్బీ, అక్టోపస్ తదితర బలగాలను ఉపయోగిస్తున్నామన్నారు. మహిళలకు రక్షణగా షీ బృందాలను రంగంలోకి దించుతామన్నారు. పోకిరీలు, అసాంఘిక శక్తులపై షీ టీమ్స్, స్పెషల్ పార్టీలు ప్రత్యేకంగా నజర్ పెడతాయని చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ సిబ్బంది సమన్వయంతో స్టేడియం నుంచి క్రికెటర్లు బస చేసే హోటల్స్ వరకు ఎస్కార్ట్ కల్పించనున్నట్టు తెలిపారు. అత్యవసర సేవల కోసం మెడికల్ టీంలను అందుబాటులో ఉంచామన్నారు.
క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో జారీ చేసిన అక్రిడేషన్లను మార్చుకోవద్దని సూచించారు. సీసీ కెమెరాలతో స్టేడియంలోని ప్రతి వ్యక్తి కదలికలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపారు. ఒక వ్యక్తికి కేటాయిం చిన పాస్‌లు, అక్రిడేషన్లపై ఇతరులు వస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా వ్యక్తులకు కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలని, అనవసరంగా తిరుగొద్దన్నారు. మ్యాచ్‌కు రెండు గంటల ముందు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామన్నారు. మ్యాచ్ అయిపోయిన తదనంతరం గుంపులుగుంపులుగా ఒకేసారి బయటకు రావద్దని కోరారు.
ఎలక్ట్రానిక్ వస్తువుల నిషేధం
భద్రతా చర్యల్లో భాగంగా స్టేడియంలో 17 వస్తువులపై నిషేధం విధించామని సీపీ తెలిపారు. ల్యాప్టాప్స్, కెమెరాలు, మ్యాచ్బాక్స్, బైనాక్యులర్స్, బ్యాటరీస్, బ్యాగ్స్, బ్యానర్స్, సిగరెట్స్, లైటర్స్, కాయిన్స్, హెల్మెట్స్, బయటి తినుబండారాలు, వాటర్ బాటిళ్లు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, పదునైన మెటల్స్/ప్లాస్టిక్ వస్తువులు, పెన్స్, పెర్ఫ్యూమ్స్, జెండా కర్రలు స్టేడియంలోకి తీసుకెళ్లొద్దన్నారు. తనిఖీ సమయంలో సెల్‌ఫోన్‌ను సెక్యురిటీ సిబ్బందికి చూపిస్తే వారు స్విచ్చాఫ్ చేసి.. తిరిగి అందిస్తారన్నారు. హ్యాకర్లు స్టేడియం పరిసరాల్లోకి రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఉపయోగించాలి
మ్యాచ్‌లు చూసేందుకు వచ్చే క్రికెట్ అభిమానులు, ప్రేక్షకులతోపాటు సాధారణ వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలూ చేపట్టామని సీపీ తెలిపారు. ట్రాఫిక్ విభాగం నుంచి ప్రత్యేకంగా 215మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించామని, భారీ వాహనాలను శివారు ప్రాంతాల నుంచే మళ్లిస్తామని తెలిపారు. వాహనాలకు ఎలాంటి పార్కింగ్ రుసుమూ వసూలు చేయరని, ప్రేక్షకుల కోసం 9వేలకుపైగా వాహనాలకు పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు. మెట్రో, బస్సులు, క్యాబ్లాంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఉపయోగించుకుంటే ట్రాఫిక్ జామ్‌లు ఉండవని వివరించారు. సికింద్రాబాద్, హబ్సి గూడ, అంబర్పేట్, రామంతాపూర్, ఎల్బీనగర్, వారాసి గూడ వైపు నుంచి వాహనాలు స్టేడియానికి వస్తాయని, ఆయా రూట్లలో చుట్టూ మొత్తం 18 పార్కింగ్ పాయింట్లు ఏర్పా టు చేశామన్నారు. ప్రేక్షకులు సులువుగా గుర్తించే విధంగా 324 సూచిక బోర్డులు ఏర్పాటు చేశామని తెలిపారు.
బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు
బ్లాక్‌లో మ్యాచ్ టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. బ్లాక్‌లో టికెట్లు కొనొద్దని, అలాంటి వారిపై ప్రత్యేక నిఘా వేసి వారి సమాచారం పోలీసులకు అందించాలన్నారు. అధిక ధర లకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమా వేశంలో డీసీపీలు, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో నగరంలో మెట్రో రైల్ సర్వీసులను పెంచుతున్నట్టు అధికారులు ప్రకటించారు.